Pawan Kalyan Varahi Yatra Fourth Phase Begins: పవన్ కల్యాణ్ వారాహి నాలుగో విడత యాత్రకు సర్వం సిద్ధమైంది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నేటి నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు అవనిగడ్డ చేరుకుని వారాహి వాహనంపై నుంచి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రసంగించనున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే తెలుగుదేశంతో కలిసి నడుస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో అవనిగడ్డ బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయనున్నారు.
వారాహి సభకు వచ్చే ప్రతి తెలుగుదేశం కార్యకర్తలను ఆత్మీయంగా కలుపుకొని కార్యక్రమం విజయవంతం చేయాలని ఇప్పటికే జనసేన నాయకులకు ఆదేశాలు అందాయి. రాష్ట్రానికి జగన్ ఎందుకు వద్దు అనే విషయాన్ని ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ యాత్ర సాగనున్నట్లు జనసేన నేతలు తెలిపారు. ఏటా జాబ్ క్యాలండర్, సీపీఎస్ రద్దు, పోలవరం పూర్తి, మద్యపాన నిషేధం, విద్యుత్ బిల్లుల మోత ఇలా అన్నింటిలోనూ సర్కారు విఫలం చెందిందని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. మూడు దశల యాత్రలు ఏ స్థాయిలో విజయవంతమయ్యాయో అంతకు మించిన ఉత్సాహంతో నాలుగో విడత కార్యక్రమం జరగాలని అందుకు నాయకులు, వీర మహిళలు, జన సైనికులు సమష్టిగా కృషి చేయాలని పార్టీ కోరింది.
తెలుగుదేశం నాయకులతో ఎక్కడా పొరపొచ్చాలు రాకుండా సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అవనిగడ్డ బహిరంగ సభ అనంతరం పవన్‌కల్యాణ్ మచిలీపట్నం చేరుకోనున్నారు. రెండో తేదీన మచిలీపట్నంలో పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. మూడో తేదీన జనవాణి పేరిట ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. నాలుగో తేదీన పెడన, ఐదో తేదీన కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర(Varahi Yatra) సాగనుంది. ఈ యాత్రను విజయవంతం చేయాలని తెలుగుదేశం శ్రేణులకు లోకేశ్ పిలుపునిచ్చారు.
Balakrishna declared Support for Varahi Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన నాలుగొ విడత ‘వారాహి’ యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వెల్లడించారు. చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ అక్రమ కేసులకు తాము భయపడేది లేదని బాలకృష్ణ తేల్చిచెప్పారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని బాలకృష్ణ మండిపడ్డారు. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో స్పందన చూసి ఓర్వలేకపోయారని.. అందుకోసమే చంద్రబాబుపై స్కిల్ కేసులో.. రాజకీయ కక్షతోనే పెట్టారని బాలకృష్ణ వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.