Passport Temple In Kerala : అక్కడ విదేశాలకు వెళ్లే వారు ఎయిర్పోర్ట్ కన్నా ముందు ఆ గుడికే లైన్ కడతారు. ఆలయంలో పాస్‌పోర్ట్ పెట్టి మరీ పూజలు చేయించుకుంటారు. కేవలం చిన్నపిల్లలే కాదు.. ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులు సైతం విద్యాభ్యాసం చేసుకుంటారు. చదువుల తల్లిగా పిలిచే ఈ అమ్మవారి గుడిని ఇప్పుడు పాస్‌పోర్ట్ ఆలయంగా పిలుస్తున్నారు. అదే కేరళ కొట్టాయం జిల్లాలోని పనచ్చిక్కాడు గ్రామంలోని అవనంకోడ్ సరస్వతీ దేవి ఆలయం.
ఇటీవలే గుడికి సమీపంలో నెడుంబస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైంది. దీంతో విమానాశ్రయానికి వెళ్లే ముందు చాలా మంది ఈ గుడికి రావటం ప్రారంభించారు. అలా విదేశాలకు వెళ్లాలనుకునే వారు తమ పాస్‌పోర్టులు తీసుకొచ్చి మరీ పూజలు చేసుకొని వెళ్తున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ గుడిని పాస్‌పోర్ట్ ఆలయంగా పిలుస్తున్నారు. అలానే ఇక్కడ నిరంతరం విద్యాభ్యాస కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఆదిశంకరాచార్యుల అక్షరభ్యాసాన్ని కూడా ఈ ఆలయంలోనే నిర్వహించారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
"పిల్లలే కాకుండా విదేశాలకు వెళ్లి చదువుకోవాలని అనుకునే వారు ఇక్కడకు వచ్చి అక్షరభ్యాసం చేసుకుంటారు. సరస్వతీ దేవి 'నవు మణి నారయం' నైవేద్యాన్ని పిల్లలకు పెడితే పిల్లలకు మంచి చేతిరాత, మాట్లాడే నైపుణ్యాలు వస్తాయని నమ్మకం ఉంది. అలానే అమ్మవారికి సమర్పించిన నెయ్యిని పిల్లలకు తాగిస్తే చదువుపై ఆసక్తి పెరిగి మంచి మార్కులు సాధిస్తారు అని భక్తులు నమ్ముతారు. ప్రతిరోజు విద్యాభ్యాసాలు జరిగే అరుదైన దేవాలయాల్లో ఇది ఒకటి."
-కేఆర్ సజీశ్, కేరళ క్షేత్ర సేవా ట్రస్ట్ కోశాధికారి
అయితే చదువుల తల్లిగా పేరొందిన ఈ గుడిలో అమ్మవారికి విగ్రహం ఉండదు. కేవలం ఒక రాయిని మాత్రమే పూజిస్తారు. అందులోనే అమ్మవారు ఉంటారని భక్తుల నమ్మకం. దక్షిణ మూకాంబిగా పిలిచే ఈ అమ్మవారు సాధారణ రోజుల్లో వెండి తాపడంలో దర్శనమిస్తారు. ప్రత్యేక రోజుల్లో మాత్రం బంగారు తాపడంలో కనిపిస్తారు. ఈ ఆలయం ఉదయం ఐదున్నర గంటలకు నుంచి 10 గంటల వరకు తెరచి ఉంటుంది. తిరిగి సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు ఉంటుంది. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చాక విదేశీ యాత్రికులు కూడా తరచూ ఆలయాన్ని సందర్శిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
"విదేశాలకు వెళ్లాలని ఇక్కడికి వచ్చి పూజలు చేసిన వారి కోరికలు తీరాయి. ఇటీవలే ఇలా ఐదుగురు విదేశాలకు వెళ్లారు. అనుకున్న కోరికలు నేరవేరితే మళ్లీ ఇక్కడకు వచ్చి పూజలు చేస్తాం"
- స్థానికురాలు
కేరళ క్షేత్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే ఈ ఆలయం.. పచ్చని ప్రకృతి మధ్య ఆహ్లాదకరంగా ఉంటుంది. సర్వసతీ దేవి ఆలయానికి వచ్చే భక్తులు.. ప్రాంగణంలో నిలబడి చూస్తే విమానాలు మనపై నుంచే వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అలానే ల్యాండింగ్, టేకాఫ్ శబ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి.
కోనేరులో స్నానం చేస్తే పాపాలన్నీ మాయం! రుజువు కోసం సర్టిఫికేట్ ఇస్తున్న ఆలయం, ఎక్కడో తెలుసా?