Indians giving up Citizenship: గడిచిన ఐదేళ్లలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర ప్రభుత్వం లోక్సభకు వెల్లడించింది. విదేశాంగ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. 1,33,83,718 మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
India Citizenship news: 2017 ఏడాదిలో 1,33,049 మంది, 2018లో 1,34,561, 2019లో 1,44,017, 2020లో 85,248, 2021లో సెప్టెంబర్ 30 నాటికి 1,11,287 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని వెల్లడించారు.
4,177 మందికి భారత పౌరసత్వం
Citizenship to non indians: మరోవైపు, గడిచిన ఐదేళ్లలో 10,645 మంది భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని నిత్యానంద రాయ్ వెల్లడించారు. ఇందులో 4,177 మందికి పౌరసత్వం అందించినట్లు తెలిపారు.
భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో పాకిస్థాన్ ప్రజలే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 7,782 మంది పాకిస్థానీలు భారత పౌరసత్వానికి అప్లై చేసుకున్నట్లు నిత్యానంద రాయ్ చెప్పారు. అఫ్గానిస్థాన్ నుంచి 795 మంది, అమెరికా నుంచి 227 మంది, బంగ్లాదేశ్ నుంచి 184 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.
కులగణనపై...
Caste census in India: కులాలవారీగా జనగణనపైనా కీలక ప్రకటన చేశారు నిత్యానంద రాయ్. స్వాతంత్ర్యం తర్వాత ఎస్సీ, ఎస్టీ మినహా కులాలవారీగా జనగణన చేపట్టలేదని చెప్పారు. రాజ్యాంగంలో పొందుపర్చినట్లుగా షెడ్యూలు కులాలు, తెగల వివరాలనే సేకరిస్తున్నామని పేర్కొన్నారు. 2021 జనగణనపై 2019 మార్చిలోనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని గుర్తు చేసిన మంత్రి... కరోనా కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడిందని తెలిపారు. సంబంధిత మంత్రులతో సమావేశమైన తర్వాత దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: సభ్యుల సస్పెన్షన్పై రగడ- రెండో రోజూ సాగని సభ