OSCW Order On Not Allowing Women As First Passengers In Buses : ఒడిశాలో ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో మొదటి ప్యాసింజర్‌గా మహిళలను ఎక్కనివ్వట్లేదట! వారు మొదట బస్సు ఎక్కితే కొంతమంది అపశకునంగా భావిస్తున్నారట. దీనిపై ఓ సామాజిక కార్యకర్త.. ఆ రాష్ట్ర మహిళ కమిషన్‌ను ఫిర్యాదు చేశాడు. రాష్ట్రంలో మహిళలపై వివక్ష చూపుతున్నారంటూ కమిషన్‌కు తెలిపాడు.
సోనేపుర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఘసిరామ్ పాండా.. భువనేశ్వర్ బారాముండా బస్టాండ్‌లోని బస్సులో తొలి ప్రయాణికురాలిగా ఓ మహిళను ఎక్కనీయకుండా సిబ్బంది అడ్డుకున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై రంగంలోకి దిగిన మహిళా కమిషన్.. పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. "బస్సులో మొదటగా మహిళ అడుగుపెడితే.. ఆ రోజు బస్సు ప్రమాదానికి గురవుతుంది. లేదంటే ఆదాయం సరిగ్గా రాదు. కొంతమంది మూఢనమ్మకం నుంచి ఈ వివక్షపూరిత, అహేతుక ఆచారం పుట్టుకొచ్చిందని" మహిళ కమిషన్ గుర్తించింది.
![odisha-state-commission-for-women-order-on-not-allowing-women-as-first-passengers-in-buses](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-07-2023/od-bbsr-03-byte-first-women-passanger-7209787_27072023155913_2707f_1690453753_979_2807newsroom_1690526977_640.jpg)
ఈ నేపథ్యంలోనే బస్సు తొలి ప్రయాణికులుగా మహిళలు ఎక్కేందుకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని రవాణాశాఖకు సూచించింది. గతంలోనూ ఇలాంటి తరహా ఘటనలు తమ దృష్టికి వచ్చినట్లు మహిళ కమిషన్ తెలిపింది. మహిళా ప్రయాణికులకు ఇకముందు అసౌకర్యం కలగకుండా, వారి గౌరవాన్ని, భద్రతను కాపాడేందుకుగానూ.. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు తమ మొదటి ప్యాసింజర్‌గా మహిళలనూ అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. సిబ్బందికి ఈ మేరకు అవగాహన కల్పించాలని తెలిపింది. అదే విధంగా బస్సుల్లో మహిళల రిజర్వేషన్‌ను 50 శాతానికి పెంచాలని మహిళ కమిషన్ సూచించింది.
నెల రోజులుగా ఊరి బయటే బాలింత, పసిబిడ్డ.. మూఢ నమ్మకాలకు శిశువు బలి..
కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో మూఢ నమ్మకాల కారణంగా నవజాత శిశువు బలైంది. ఆచారం పేరిట.. అప్పుడే పుట్టిన చిన్నారిని, బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని ఊరికి దూరంగా ఉంచడం వల్ల ఓ పండంటి శిశువు ప్రాణాలు కోల్పోయింది. తుమకూరులో ఈ ఘటన జరిగింది. మల్లెనహళ్లి గొల్లార్హట్టి గ్రామానికి చెందిన సిద్ధేశ్, వసంతలకు నెల రోజుల క్రితం కవలల రూపంలో ఓ బాబు, పాప జన్మించారు. పుట్టిన వెంటనే బాలుడు మృతి చెందాడు. దీంతో బాలికతో కలిసి తమ గ్రామానికి వచ్చారు.
అయితే, గ్రామంలోని ప్రజలు సూతక ఆచారం అనే అంధ విశ్వాసం పాటిస్తుంటారు. ఈ మూఢ నమ్మకం ప్రకారం నవజాత శిశువులను, బాలింతలను గ్రామంలోకి రానివ్వరు. కుటుంబంలో ఎవరైనా చనిపోయినా.. వారిని ఊరికి దూరంగానే ఉంచుతారు. అలాంటి వారిని ఊర్లో ఉంచితే తమ దేవుడికి ఇష్టం ఉండదని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో వసంతను సైతం ఊర్లోకి అనుమతించలేదు. దీంతో గ్రామ శివారులో ఏర్పాటు చేసిన గుడిసెలో వసంత.. తన బిడ్డతో కలిసి కొన్ని రోజులూ గడిపింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.