Number of vehicles in India 2022 : దేశవ్యాప్తంగా 21 కోట్లకుపైగా ద్విచక్ర వాహనాలు, ఏడు కోట్లకుపైగా నాలుగు చక్రాలు, ఆపై కేటగిరి వాహనాలు రిజిస్టరయి ఉన్నాయి. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పార్లమెంటులో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ గణాంకాలు వెల్లడించారు. కేంద్రీకృత డేటాబేస్ 'వాహన్' సమాచారం ప్రకారం.. ఆగస్టు 3 నాటికి మొత్తం వాహనాల్లో 5.44 లక్షల బైకులు, 54 వేలకుపైగా నాలుగు చక్రాలు, ఆపై కేటగిరి వాహనాలు విద్యుత్‌తో నడిచేవి ఉన్నాయని తెలిపారు. సీఎన్‌జీ, ఇథనాల్, ఫ్యూయల్ సెల్ హైడ్రోజన్, ఎల్‌ఎన్‌జీ, ఎల్పీజీ, సోలార్, మిథనాల్ మొదలైన ఇంధన రకాలతో నడిచేవి 2.95 లక్షల ద్విచక్ర వాహనాలు, 18.47 లక్షల నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని డేటా వెల్లడించింది.
వేరే ఇతర ప్రశ్నకు మంత్రి గడ్కరీ సమాధానమిస్తూ.. జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రాథమిక బాధ్యత వహిస్తుందని చెప్పారు. 'వర్షాకాలంలో వరదలు, కొండచరియలు విరిగిపడటం తదితర కారణాలతో కొన్నిసార్లు జాతీయ రహదారులకు నష్టం వాటిల్లుతుంది. అయితే, వెంటనే పునరుద్ధరణ పనులు చేపడతాం' అని తెలిపారు. జాతీయ రహదారుల అభివృద్ధి, నవీకరణ.. నిరంతర ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం, జాతీయ రహదారుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఇప్పటికే ఉన్న పేవ్‌మెంట్‌లు, వంతెనల మరమ్మతులు, హైవేస్‌పై రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం వంటి ప్రాజెక్టులను తమ శాఖ చేపడుతోందని ఆయన చెప్పారు.