భారత్‌లోని నలుగురిలో దక్షిణాఫ్రికా తరహా కరోనా వైరస్ బయటపడిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో అంగోలా, టాంజానియా వెళ్లివచ్చిన వారు ఒక్కొక్కరు, దక్షిణాఫ్రికా వెళ్లివచ్చిన వారు ఇద్దరు ఉన్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడించారు. ఒకరిలో బ్రెజిల్ తరహా వైరస్ గుర్తించినట్లు తెలిపారు. ఈ అయిదుగురు సహా వీరిని కలిసిన వారందరికీ పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్‌కు పంపినట్లు వివరించారు.
దక్షిణాఫ్రికా, బ్రెజిల్ తరహా వైరస్‌లను భారతీయ కరోనా వ్యాక్సిన్‌లు ఎదుర్కొనే తీరుపై పుణెలోని జాతీయ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌లో ప్రయోగాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ వైరస్‌లపై నిశిత పరిశీలన ఉంచినట్లు బలరాం భార్గవ తెలిపారు. అటు దేశంలో ఇప్పటి వరకు 87లక్షల 40వేల 595 మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు.
పెరిగిన రికవరీ రేటు...
17 రాష్ట్రాల్లో కొత్తగా ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరో ఆరు రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగు చూడలేదని పేర్కొంది. తాజాగా 11,805 మంది మహమ్మారి నుంచి బయటపడగా... మొత్తం రికవరీల సంఖ్య 1 కోటీ 6 లక్షల 33 వేలకు పెరిగింది. దీంతో రికవరీ రేటు 97.32 శాతానికి చేరింది. ఇది ప్రపంచంలోనే అత్యధికమని కేంద్రం స్పష్టం చేసింది.