అదానీ గ్రూప్‌ను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీకి బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తోసిపుచ్చారు. బంధువులు, సన్నిహితులకు ప్రయోజనాలు చేకూర్చడం కాంగ్రెస్ సంస్కృతి కావచ్చని.. కానీ, మోదీ ప్రభుత్వం వైఖరి కాదని ఆమె ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకునే కేటాయింపులు చేశామని, ఎవరినీ ప్రత్యేకంగా చూసి కేటాయింపులు జరగలేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం దేశాన్ని దృష్టిలో ఉంచుకుంటుందని.. ఇలాంటి వ్యాఖ్యలు తప్పని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు చేసిందని వివరించారు. లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చలో ఆమె ఈ మేరకు సమాధానమిచ్చారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌లో క్లీన్ ఎనర్జీ ట్రాన్సిమిషన్ కోసం రూ. 35,000 కోట్లు కేటాయించారు. కాగా, అదానీ గ్రూప్‌నకు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థలు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వంటి భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. దీంతో ఈ కేటాయింపులు అదానీ గ్రూప్‌ల సంస్థల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని చేసినవేనని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి.
అదానీ వివాదంపై చర్చకు పట్టుబడతాం: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
అదానీ వ్యవహారంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఈ విషయంపై పార్లమెంట్‌తో పాటు బయట కూడా గళమెత్తుతామని ఆయన పునరుద్ఘాటించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఖర్గే.. దీనిని ఓ పెద్ద కుంభకోణంగా పరిగణిస్తున్నామన్నారు.
ప్రభుత్వం ఈ విషయంపై ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ చేపట్టకపోతే ప్రజలే వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆయన మండిపడ్డారు. ఈ స్కామ్‌లో పెద్ద మొత్తంలో ప్రజాధనం ఉన్నందున దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించకుండా.. ఎందుకు వెనకడుగు వేస్తుందో చెప్పాలని ఆయన కోరారు. దేశంలో ఎక్కడా స్కామ్ జరిగినా దర్యాప్తు సంస్థలు ముందుంటాయని.. కానీ, ఈ విషయంలో సదరు నిఘా వర్గాలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అదానీ అంశాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరపాలన్న డిమాండ్‌పై ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
విచారణ జరిపించే ప్రసక్తే లేదు
ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న విధంగా అదానీ సమస్యపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ చేయించే ప్రసక్తే లేదని విదేశాంగ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు పూర్తిగా అర్థరహితమని అలాగే జేపీసీ విచారణ డిమాండ్ కూడా నిరాధారమైనదని ఆయన ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.