NIA Charge Sheet: భారత్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడేందుకు ఉగ్రమూకలు చేస్తున్న కుట్రకు సంబంధించిన కేసులో 25 మంది ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ శుక్రవారం ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. నిందితులంతా హైబ్రిడ్ ఉగ్రవాదుల నియామకం కోసం పనిచేస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఎ-తోయిబా వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో వారికి సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ అధికారి తెలిపారు. వీరంతా జమ్ముకశ్మీర్ వాసులేనని, భారతీయ శిక్షాస్మృతి, చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని ఎన్ఐఏ అధికారి అన్నారు. వివిధ వెబ్‌సైట్‌లు, బ్లాగ్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా యువతను ఉగ్రవాదులుగా మార్చడానికి నిందితులు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. తీవ్రవాద సంస్థలన్నీ పాకిస్థాన్ కేంద్రంగానే పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం 'హైబ్రిడ్' విభాగాన్ని ముఠాలు ఏర్పాటు చేసుకుంటున్నాయని తెలిపారు. మైనారిటీలు, పౌరులు, వలసదారులు, ప్రభుత్వ అధికారులు, భద్రతా సిబ్బందిని హత్యలు చేయడమే ఆ సంస్థల లక్ష్యమని అన్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
ఇదీ చదవండి: ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి కేంద్ర కేబినెట్ ఆమోదం