ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల ఉత్పత్తి వేగవంతం చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దానికోసం అన్ని అడ్డంకుల్ని తాత్కాలికంగా తొలగించాలని కోరారు. 'టీకా సమానత్వం: ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఏం చేయగలదు?' పేరుతో డబ్ల్యూటీఓ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కొవిడ్-19 నివారణ, చికిత్స, నియంత్రణకు సంబంధించి మేధో సంపత్తి హక్కుల వాణిజ్య సంబంధిత అంశాల(ట్రిప్స్) నిబంధనల నుంచి తాత్కాలికంగా ఉపశమనం ఇవ్వాలని డబ్ల్యూటీఓలో.. భారత్, దక్షిణాఫ్రికా సహా 57దేశాలు ప్రతిపాదించాయని పేర్కొన్నారు.
"టీకాలకు మాత్రమే కాకుండా.. చికిత్స, డయాగ్నోస్టిక్స్ వంటి ఇతర వైద్య పరికరాల ఉత్పత్తిని త్వరగా పెంచే వాతావరణాన్ని మనం సృష్టించాలి. దీనికి అవసరమైన మేధో సంపత్తి రక్షణతో సహా, కొవిడ్-19 వైద్య పరికరాల ఉత్పత్తికి ఉన్న అన్ని అడ్డంకులను తాత్కాలికంగా తొలగించాల్సిన అవసరం ఉంది."
-పీయూష్ గోయల్ , కేంద్ర మంత్రి
పరిమిత లైసెన్సింగ్ ఒప్పందాల కారణంగా దేశాలు తగినన్ని వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయలేకపోతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'కరోనాను ప్రకృతి విపత్తుగా ప్రకటించండి'