MP Election Parmanand Tolani : మధ్యప్రదేశ్‌కు చెందిన ఇందౌర్ నివాసి పర్మానంద్ తోలని వివిధ ఎన్నికల్లో 18 సార్లు ఓటమి పాలయ్యారు. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. 19వ సారి నామినేషన్ వేశారు. 63 ఏళ్ల వయసు ఉన్న పర్మానంద్ తన తండ్రి 1988లో మరణించగా.. తర్వాతి సంవత్సరం నుంచి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు తెలిపారు.
డిపాజిట్లు కూడా..
పోటీ చేసిన అన్నీ ఎన్నికల్లోనూ ఆయనకు డిపాజిట్లు కూడా దక్కలేదు. వరుస పరాజయాలతో ఇందౌర్ ధర్తి పకడ్ అనే బిరుదును పర్మానంద్ సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల తన ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపిన పర్మానంద్.. నవంబర్ 17న జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇందౌర్-4 స్థానం నుంచి ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
![MP Election Parmanand Tolani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-10-2023/19859719_wowow.jpg)
30 ఏళ్ల పాటు ఎన్నికల్లో తండ్రి పోటీ.. ఇప్పుడు కుమారుడు..
Who is Parmanand Tolani : పర్మానంద్ తోలని కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. గతంలో తన తండ్రి ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ 30 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేశారని.. తర్వాత దానిని తాను కొనసాగిస్తున్నానని పర్మానంద్ తెలిపారు. పర్మానంద్ కుటుంబ సభ్యులు కూడా కొన్ని ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. తన భార్య గతంలో మేయర్ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైందని ఆయన తెలిపారు.
ఓటర్లపై హామీల వర్షం!
ఇంత మంది తన కుంటుబం నుంచి పోటీ చేసిన ఏ ఒక్కరూ గెలుపొందలేదని పర్మానంద్ పేర్కొన్నారు. అయినా వెనుకంజ వేయకుండా.. తనే కాదు.. తన తర్వాతి తరం కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే.. 1000 చదరపు అడుగుల భవనాలపై పూర్తిగా ఆస్తి పన్ను మినహాయించడం సహా నగరపాలక సంస్థ వసూలు చేసే పన్నులను రద్దు చేస్తానని పర్మానంద్ ఓటర్లకు హామీ ఇస్తున్నారు.
మధ్యప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
- నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 21
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 30
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 31
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 2
- మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 17
- ఫలితాల లెక్కింపు తేదీ: డిసెంబర్ 3