దేశంలో పెగాసస్ స్పైవేర్(Pegasus Spyware) వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. తాజాగా ఫోన్ల ట్యాపింగ్‌ను తప్పుబడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee news). దేశాన్ని నిఘా రాజ్యంగా మార్చాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించాలని సుప్రీం కోర్టును కోరారు. అలాగే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు విపక్షాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
కోల్‌కతాలో అమరుల సంస్మరణ ర్యాలీలో వర్చువల్‌గా పాల్గొని, ఈ వ్యాఖ్యలు చేశారు మమత.
" ప్రజాస్వామ్య దేశాన్ని సంక్షేమ రాజ్యంగా కాకుండా నిఘా రాజ్యంగా మార్చాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. చమురు, ఇతర వస్తువులపై వసూలు చేసిన పన్నులను.. సంక్షేమ పథకాలకు కాకుండా ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి నిఘా పెట్టేందుకు ఖర్చు చేస్తోంది. నా ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైందని తెలుసు. తమ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని విపక్ష నేతలందరికీ తెలుసు. ఈ విషయంపై ఎన్సీపీ నేత శరద్ పవార్, ఇతర విపక్ష నేతలు, ముఖ్యమంత్రులతో నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ, మాపై నిఘా.. భాజపాను 2024 లోక్‌సభ ఎన్నికల్లో రక్షించదు. "
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
కొవిడ్ రెండో దశ ఉద్ధృతిని కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయటంలో విఫలమైందని ఆరోపించారు మమత. భాజపాను 'పూర్తిగా వైరస్‌తో నిండిన పార్టీ'గా అభివర్ణించారు. ఎట్టి పరిస్థితుల్లో ఓడించాల్సిన అవసరం ఉందన్నారు.
తమ ర్యాలీలో దిల్లీ నుంచి వర్చువల్‌గా హాజరైన.. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, శివసేన సహా ఇతర పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు మమత.
1993లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ర్యాలీపై పోలీసులు కాల్పులు జరపగా 13 మంది చనిపోయారు. వారికి గుర్తుగా ఏటా జులై 21న అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది టీఎంసీ. ఆ సమయంలో కాంగ్రెస్‌లో ఉన్నారు మమత.
ఇదీ చూడండి: Pegasus Software: ఒక్క మిస్డ్‌కాల్‌తో ఫోన్ హ్యాక్!
Pegasus Spyware : పెగాసస్ జాబితాలో ఫ్రాన్స్ అధ్యక్షుడి నంబర్!