కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైన వేళ.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి విస్తరణ ఇదే కావడం వల్ల... ఎవరెవరికి ఆయన తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తారోనని చర్చనీయాంశంగా మారింది. మొత్తం 22 మంది కొత్తవారికి అవకాశం లభించనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మార్పులు చేర్పులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే.. ఈ 22 మందిలో యువత, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.
15 నుంచి 20 మంది వారే..
మంత్రివర్గంలో మొత్తం 15 నుంచి 20 మందిని ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారిని తీసుకుంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అణగారిన సామాజిక వర్గాలకు చెందిన నేతలకు కూడా మోదీ మంత్రివర్గంలో చోటు లభించవచ్చని చెప్పాయి. కేబినెట్లో ఈసారి మహిళల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నాయి.
అతిచిన్న ప్రాంతాలను శక్తిమంతం చేసే దిశగా.. వివిధ రాష్ట్రాల్లోని చెందిన వ్యక్తులకు తన మంత్రివర్గంలో చోటు కల్పించాలని మోదీ భావించారని తెలుస్తోంది. అలాగే.. యువనేతలకు ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
విద్యావేత్తలకు..
అనుభవంతో పాటు విద్యావేత్తలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. పీహెచ్డీ, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ వంటి ఉన్నత విద్యావంతులను దృష్టిలో పెట్టుకుని మోదీ మంత్రివర్గ విస్తరణ జరిగే వీలుంది. సుదీర్ఘకాలం మంత్రి పదవులను నిర్వహించిన వారికి, లేదా శాసనసభ్యులుగా ఎక్కువ కాలం సేవలందించిన వారికి కూడా మోదీ తన మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారని తెలుస్తోంది.