అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వలస వచ్చి.. గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లోని 13 జిల్లాల్లో నివసిస్తున్న ముస్లిమేతర శరణార్థులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం శుక్రవారం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ముస్లిమేతర మైనార్టీలుగా హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన్‌లు, పార్శీలు, క్రైస్తవులు తదితరులను పేర్కొంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వీటిపై వివిధ స్థాయిల్లో పరిశీలన జరుగుతుందని వివరించింది.
పౌరసత్వ చట్టం-1955 కింద, 2009లో చేసిన చట్టంలోని నిబంధనల కింద ఈ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. 2019లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద నిబంధనలను ప్రభుత్వం ఇంకా రూపొందించాల్సి ఉంది. అందువల్ల ప్రస్తుత నోటిఫికేషన్‌కు ఈ చట్టంతో సంబంధంలేదు. సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లో వేధింపులకు గురై, 2014 డిసెంబరు 31కు ముందు భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వం ఇవ్వాలని ఈ చట్టం చెబుతోంది.
ఇవీ చదవండి: 'అలా చేస్తే.. బాబా రాందేవ్‌పై కేసుల ఉపసంహరణ'