Sikkim car accident: మహారాష్ట్రకు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు, వారి డ్రైవర్ సిక్కింలో జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కెదుంగ్ భిర్ ప్రాంతంలోని ఓ లోయలోకి కారు దూసుకెళ్లడం వల్ల ఈ ఘటన జరిగింది. ప్రముఖ పర్యటక ప్రదేశమైన లాచుంగ్‌కు 13 కిలోమీటర్ల దూరంలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
Maharashtra family died in Sikkim: సెలవుల నేపథ్యంలో వీరంతా సిక్కిం రాష్ట్రానికి వచ్చారని పోలీసులు తెలిపారు. లాచుంగ్ నుంచి గ్యాంగ్‌టక్‌కు వెళ్తున్నారని వెల్లడించారు. వాహనం స్కిడ్ అయి.. వందల అడుగుల లోతైన లోయలోకి పడిపోయిందని చెప్పారు. మృతులను సురేశ్ పునామియా, తురాల్ పునామియా, హిరాల్ పునామియా, దేవాన్షి పునామియా, జయన్ పునామియా గుర్తించారు. వాహన డ్రైవర్ సోమి బిశ్వకర్మ సైతం ప్రమాదంలో మరణించాడని తెలిపారు. మృతదేహాలను వెలికితీయడంలో సైన్యం సహకరించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Maharashtra accident news: మరోవైపు, ఓ వ్యక్తి తప్పతాగి కారును వేగంగా నడుపుతూ స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టాడు. ఆదివారం తెల్లవారుజామున ముంబయి సమీపంలోని మహిమ్ కాస్‌వే వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్కూటర్ నడుపుతున్న మోయిజ్ అన్సారీ ప్రాణాలు కోల్పోయాడు. అతడి సోదరి తీవ్రంగా గాయపడింది. వీరిద్దరూ డోంగ్రి నుంచి దక్షిణ ముంబయికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
"ద్విచక్రవాహనాన్ని స్కోడా కారు ఢీకొట్టింది. కారును ఆమిర్ జావెద్ షేక్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. దరాయుస్ టిగినా అనే వ్యక్తి సైతం కారులో ఉన్నారు. ఇద్దరినీ అరెస్టు చేశాం. కొందరు ప్రయాణికులు అన్సారీ, అతడి సోదరిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అన్సారీ చనిపోయాడని వైద్యులు నిర్ధరించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కారులో మద్యం సీసాలు కనిపించాయి. నిందితులిద్దరూ పీకల దాకా తాగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఐపీసీ, మోటార్ వాహనాల చట్టం ప్రకారం వీరిద్దరిపై కేసు నమోదు చేసుకున్నాం. కారును సీజ్ చేశాం" అని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: