Maharashtra Drainage Accident: డ్రైనేజ్ శుభ్రం చేసేందుకు మ్యాన్హోల్లోకి దిగిన ఓ వ్యక్తి సహా అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపుర్లో గురువారం సాయంత్రం జరిగింది. మృతుల్లో ముగ్గురిని ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
![labourers killed in drainage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13996145_solapur.jpg)
కాపాడబోయి...
సోలాపుర్-అక్కల్కోట్ హైవే మార్గంలోని సాదుల్ పెట్రోల్ పంప్ వద్ద డ్రైనేజీ నాలాలను.. శుభ్రం చేసే పనులు చేపడుతోంది సోలాపుర్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ క్రమంలో మ్యాన్హోల్లోకి దిగిన ఓ వ్యక్తి.. ఆక్సిజన్ అందకపోవడం, విషవాయువులు చుట్టుముట్టడం కారణంగా ఊపిరి తీసుకోలేకపోయాడు. అక్కడే ఉన్న మరో ముగ్గురు మ్యాన్హోల్లోకి దిగి అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ వారు కూడా అందులో చిక్కుకున్నారు. ఈ నలుగురూ ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో వారిని రక్షించేందుకు మ్యాన్హోల్లోకి దిగిన మరో ఇద్దరు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
స్థానికులు వీరిని రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే నలుగురు మృతిచెందారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు ఎలాంటి రక్షణ పరికరాలు ధరించలేదని స్థానికులు వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే వారు ప్రాణాలు కోల్పోయారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్.. దర్యప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మృతులను విశాల్, బచన్ పరము రిషిదేవ్, ఆశిష్ కుమార్ భరత్ సింగ్ రాజ్పుత్, సునీల్ గుల్జారిలాల్ ధాకా, విశాల్ హిప్పేర్కర్గా గుర్తించారు పోలీసులు. వీరిలో ఒకరు మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాకు చెందిన వారు కాగా మరో ముగ్గురు ఉత్తర్ప్రదేశ్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వలస వచ్చారు.
ఇదీ చూడండి : స్టంట్ చేస్తుండగా అదుపు తప్పిన బైక్.. ఎగిరిపడ్డ రైడర్