రాజస్థాన్ బుందీలో దారుణం జరిగింది. 80 ఏళ్ల వృద్ధురాలి కాలికి ఉన్న వెండి కడియాలను దొంగిలించడానికి కర్కశంగా ప్రవర్తించారు దుండగులు. వృద్ధురాలు నిద్రలో ఉండగా ఆమె కాళ్లను నరికేశారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. దీంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దుండగులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. 80 ఏళ్ల వృద్ధురాలి కాళ్లకు ఉన్న వెండి కడియాలను దొంగిలించేందుకు ప్రయత్నించారు. అవి ఎంతకి రాకపోవడం వల్ల ఆమె కాలిని నరికేశారు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో వెంటనే వృద్ధురాలి కుమారుడు తులసీరామ్.. ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించగా.. బాధితురాలి పరిస్థితి విషమించిందని మెరుగైన చికిత్స కోసం కోటకు తరలించాలని సూచించారు వైద్యులు.
అయితే ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు భాజపా నేత, మాజీ మంత్రి ప్రభు లాల్ సైనీ. వృద్ధురాలిపై దాడిని ఖండించారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజల్లో ఆగ్రహం, భయం నెలకొందని అన్నారు. మరోవైపు, కిసాన్ మహాపంచాయత్ జాతీయ అధ్యక్షుడు రాంపాల్ స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
దళిత బాలికల పట్ల వివక్ష..
దళిత బాలికలు తోటి విద్యార్థులకు భోజనం వడ్డించారని వివక్ష చూపించాడు పాఠశాల వంట మనిషి. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన వంటమనిషి లాలా రామ్ గుర్జార్.. దళిత బాలికలు వడ్డించిన భోజనాన్ని విసిరేయమని విద్యార్థులను ఆదేశించాడు. దీంతో విద్యార్థులు భోజనాన్ని విసిరేశారు. ఈ ఘటన ఉదయ్‌పుర్ బరోడిలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జరిగింది.
బాధిత బాలికలు పాఠశాలలో జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వారు బంధువులతో కలిసి దళిత బాలికల పట్ల వివక్ష చూపిన వంట మనిషిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గోగుందా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: నితీశ్‌కు షాక్.. భాజపాలోకి జేడీయూ ఎమ్మెల్యేలు.. శాసనపక్షం విలీనం