కేరళలో సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్) వరుసగా రెండోసారి విజయం సాధించింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గానూ అధికార ఎల్‌డీఎఫ్ 99 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 41 స్థానాలకు పరిమితమైంది. భాజపా బోణీ కొట్టలేకపోయింది. ఉన్న ఒక్కస్థానాన్నీ కోల్పోయింది.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూర్‌లోని ధర్మదామ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సి.రఘునాథన్‌పై 50,123 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2016లో విజయన్‌కు 36,905 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మంత్రుల్లో ఒకరు మినహా అందరూ విజయం సాధించారు. కొల్లం జిల్లాలోని కుందర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మత్స్యశాఖ మంత్రి మెర్సికుట్టి అమ్మ కాంగ్రెస్ అభ్యర్థి విష్ణునాథ్ చేతిలో పరాజయం పాలయ్యారు. కొవిడ్ మొదటి దశ కట్టడి చర్యల్లో క్రియాశీలకంగా వ్యవహరించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వైద్య మంత్రి శైలజ.. 60,963 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన కె.టి.జలీల్ కూడా విజయం సాధించిన వారిలో ఉన్నారు.
యూడీఎఫ్ కూటమిలో గెలిచిన ప్రముఖుల్లో విపక్ష నేత రమేష్ చెన్నితాల, మాజీ సీఎం ఉమన్‌చాందీ తదితరులు ఉన్నారు. అధికార కూటమిలో సీపీఎం అత్యధికంగా 62 స్థానాలను గెలుచుకోగా.. సీపీఐ 17 చోట్ల గెలుపొందింది. విపక్ష యూడీఎఫ్‌లో అత్యధికంగా కాంగ్రెస్ 21, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) 15 గెలుచుకున్నాయి. ఆరుగురు స్వతంత్రులు విజయం సాధించారు.
'చే'జారిన అవకాశం- ఆకట్టుకోని కాంగ్రెస్
కేరళలో ఎల్‌డీఎఫ్ తర్వాత యూడీఎఫ్ అధికారంలోకి రావడం రివాజు. కానీ... ఈసారి అలా జరగలేదు. తెలుపు రేషన్‌కార్డు ఉన్నవారందరికీ ఉచిత బియ్యం, 40-60 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతినెలా రూ.2 వేల పింఛను, 5 లక్షల ఇళ్ల నిర్మాణం, శబరిమల అయ్యప్ప ఆలయంలో సంప్రదాయాలను కాపాడేందుకు ప్రత్యేక చట్టం... ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు గుప్పించింది. కానీ ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. కళాశాల విద్యార్థులతో మమేకమయ్యేందుకు వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బాగానే శ్రమించినా... ఫలితాల సాధనలో మాత్రం పార్టీ విఫలమైంది. రెండుసార్లు సీఎంగా పనిచేసిన ఉమెన్ చాందీ, ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల వర్గాల మధ్య విభేదాల నేపథ్యంలో ఫలితాల అనంతరం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామంటూ అధినాయకత్వం కాలయాపన చేసింది.
వయనాడ్‌లో ఊరట
రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం పరిధిలోని వయనాడ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరట లభించింది. ఇక్కడి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఎల్‌డీఎఫ్‌కు చెందిన మరో స్థానాన్ని ఆ పార్టీ గెలుచుకుంది. మొత్తంగా ఇక్కడ 3 సీట్లకుగానూ అధికార కూటమి ఒక స్థానానికే పరిమితమైంది.
కమలం సున్నా
'గాడ్స్ ఓన్ కంట్రీ'లో మెట్రో వేగంతో దూసుకెళ్తామని ధీమా వ్యక్తం చేసిన భాజపా... ఎన్నికల ఫలితాల్లో చతికిలపడింది! కామ్రేడ్ల జోరుకు... ఉన్న ఒక్క స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేక పోయింది. పాలక్కడ్ నుంచి పోటీచేసిన ఆ పార్టీ అభ్యర్థి, మెట్రోమ్యాన్ శ్రీధరన్; త్రిస్సూర్ నుంచి బరిలోకి దిగిన సినీ నటుడు సురేశ్ గోపీ; కొన్ని, ముంజేశ్వర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌లకు ఓటమి తప్పలేదు. కాషాయ పార్టీ తరఫున 2016లో నీమం నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాజగోపాల్... ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. గోవా గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉండటంతో ఆయన పోటీ చేయలేదు. నీమం నుంచి భాజపా ఈసారి కె.రాజశేఖరన్‌ను నిలిపినా, ప్రయాస ఫలించలేదు.
ఇవీ చదవండి:
'విజయన్' ఫార్ములా హిట్- కేరళలో నయా రికార్డ్
కేరళలో ఓట్ల లెక్కింపు పూర్తి- 99 స్థానాల్లో ఎల్‌డీఎఫ్ విజయం