సాంకేతికత అభివృద్ధి చెందుతున్న క్రమంలో.. వ్యవసాయ రంగంలోనూ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. దీంతో రైతులు సంప్రదాయ వ్యవసాయ విధానాలకు స్వస్తి చెప్పి.. ఆధునిక పద్ధతిలో యంత్రాల సాయంతో సాగు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే ఖర్చుతో కూడుకున్న ఈ యంత్రాల వినియోగం చిన్న, మధ్యతరహా రైతులకు భారంగా మారుతోంది. ఇది గుర్తించిన కర్ణాటకకు చెందిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు.. తక్కువ ధరతో పంట కోత యంత్రాన్ని రూపొందించారు. జాతీయ ఇన్‌స్పైర్ అవార్డును దక్కించుకున్నారు.
విజయపుర జిల్లా నాద్ కె.డి. గ్రామానికి చెందిన దేవేంద్ర బిరదార్, కార్తీక్ నరైన్.. కూలీల కొరతతో బాధపడుతున్న అన్నదాత కోసం ఓ యంత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నారు. పాత ఫ్యాన్ విడిభాగాలు, మూలపడిన సైకిల్ చక్రాలు, పాత సామగ్రిని ఉపయోగించి.. అతి తక్కువ ధరతో కోత యంత్రాన్ని తయారు చేశారు. రూ.25 నుంచి 30 వేల వ్యయంతో ఈ ఎలక్ట్రిక్ పవర్డ్ మెషీన్‌ను సృష్టించారు. దీనికి 'భీమ సాలగ' అని పేరు పెట్టారు.
పంట కోయడానికే కాకుండా.. విత్తనాలు జల్లడానికి, కలుపు తీయడానికి, గడ్డి కోతకు కూడా ఈ మెషీన్‌ను ఉపయోగించవచ్చు. ఇదే యంత్రంతో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఇన్‌స్పైర్ అవార్డు 2019-20 వర్చువల్ పోటీలో పాల్గొని.. రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచారు. జాతీయ స్థాయిలో 28వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఫలితంగా పురస్కారంతో పాటు రూ.10 వేల నగదు ప్రోత్సాహకం కూడా లభించింది.
"ఈ యంత్రానికి జాతీయ అవార్డు గెలుచుకుంటామని ఊహించలేదు. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మమ్మల్ని అభినందిస్తున్నారు. ఈ యంత్రాన్ని రూపొందించడానికి వారు మాకు అండగా నిలిచారు. ఈ యంత్రాన్ని పంటలు కోయడానికి మాత్రమే కాకుండా.. పంట విత్తనాలు వేసేందుకు కూడా రైతులు ఉపయోగించవచ్చు."
-దేవేంద్ర బిరదార్, విద్యార్థి
"రైతులకు సరసమైన ధరలో యంత్రాన్ని అందుబాటులో ఉంచేలా తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ అవార్డును పొందడం అదృష్టంగా భావిస్తున్నాం."
-కార్తీక్ నరైన్, విద్యార్థి
ప్రభుత్వం ద్వారా పేటెంట్ లభిస్తే ఈ యంత్రాలు భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు ఈ ఇద్దరు విద్యార్థులు.
ఇదీ చూడండి: ఎలక్ట్రిక్ బైక్‌గా పెట్రోల్ బండి- ఖర్చు కూడా తక్కువే!