5rs Doctor in Mandya: చిన్న పాటి ట్రీట్‌మెంట్‌కే లక్షల రూపాయలు ఖర్చవుతున్న ఈ రోజుల్లో.. కర్ణాటక మండ్యకు చెందిన చర్మ వైద్యుడు శంకర్‌గౌడ మాత్రం గత 38 ఏళ్లుగా కేవలం ఐదు రూపాయలకే సేవలు అందిస్తున్నారు. కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చి వదిలేయకుండా.. రోగుల ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకుని చౌకగా లభించే మంచి మందులను ఇస్తున్నారు. అందుకే ఆయన స్థానికంగా ఐదు రూపాయల డాక్టర్‌గా ప్రసిద్ధి చెందారు. మైసూరు మెడికల్ కాలేజీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ గోవింద స్ఫూర్తితోనే ఇలా చేస్తున్నట్లు చెప్పారు శంకర్‌గౌడ.
"నా చిన్నతనంలో డాక్టర్ గోవింద వద్దకు చికిత్స కోసం వెళ్లేవాడిని. ఆయన అనేక మంది పేద రోగులకు వైద్యం చేస్తూ సాయం చేసేవారు. అది చూసిన నేను చిన్నతనంలోనే ఆయనను ఆదర్శంగా తీసుకుని వైద్యుడిని అయ్యాను."
-శంకర్‌గౌడ, ఐదు రూపాయల డాక్టర్
ఇంజినీరింగ్ చదవాలని చిన్నతనంలో ఆశపడ్డ శంకర్‌గౌడ.. కుటుంబ సభ్యుల కోరికతో మనసు మార్చుకున్నారు. కస్తుర్బా మెడికల్ కాలేజీ మణిపుర్లో ఎంబీబీఎస్ చదివారు. డెర్మటాలజీ విభాగంలో డిప్లొమా చేశారు. ఎంబీబీఎస్ పూర్తిచేసిన సమయంలో శంకర్‌గౌడ మనసులో ఓ ఆలోచన వచ్చింది. తాను చదివిన చదువు పేదవారికి, గ్రామీణులకు ఉపయోగపడాలి అనుకున్నారు. దీంతో కేవలం ఐదు రూపాయలకే వైద్య సేవలను ప్రారంభించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఏరోజూ ఫీజు గురించి ఆలోచించకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు తన శక్తిమేర సేవలు చేస్తున్నారు.
డాక్టర్ శంకర్‌గౌడ తన క్లినిక్ వద్ద ఉదయం, మధ్యాహ్నం రోగులకు వైద్యం చేస్తారు. ఆయన దగ్గర వైద్యం చేయించుకోవడం కోసం ఇతర జిల్లాల నుంచే కాక పొరుగు రాష్ట్రాల ప్రజలు సైతం వస్తారు. మొదట్లో రోజుకు 10 మంది వస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య సగటున 200కు చేరింది. దీంతో పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో నయం కాని రోగాలకు సైతం చికిత్స చేస్తూ మంచి హస్తవాసి గల ఐదు రూపాయల డాక్టర్‌గా ప్రసిద్ధి చెందారు.
64 ఏళ్ల శంకర్‌గౌడ వైద్యుడు మాత్రమే కాదు మంచి రైతు కూడా. ఆయన వ్యవసాయం, మొక్కల పెంపకం అంటే చాలా ఇష్టపడతారు. ఫోన్, కంప్యూటర్, ఇంటర్నెట్ ఉపయోగించరు. రోగులకు ఆయన చేస్తున్న సేవలకు గాను 'కర్ణాటక కల్పవృక్ష' సహా అనేక అవార్డులు లభించాయి. తాజాగా గుండె ఆపరేషన్ చేయించుకున్న శంకర్‌గౌడ.. డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ వైద్యం చేస్తున్నారు.
ఇదీ చదవండి: జావా, పైథాన్.. ఏదైనా సై! 13 ఏళ్లకే 17 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై పట్టు