రేడియేషన్ పెరుగుతుందనే కారణంతో దేశంలో 5జీ సాంకేతికత అమలును వ్యతిరేకిస్తూ నటి, పర్యావరణ కార్యకర్త జూహీ చావ్లా దాఖలు చేసిన వ్యాజ్యంపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని లోపభూయిష్ట పిటిషన్‌గా అభివర్ణించింది. మీడియాలో పబ్లిసిటీ కోసమే వ్యాజ్యాన్ని దాఖలు చేశారని పేర్కొంది.
జూహీతో పాటు మరో ఇద్దరు కలిసి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞప్తులు చేయకుండా నేరుగా కోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించింది. తొలుత ప్రభుత్వాన్ని సంప్రదించాలని పిటిషనర్లకు సూచించారు న్యాయమూర్తి జస్టిస్ జేఆర్ మిధా. అక్కడ వారికి ప్రతికూల స్పందన వస్తే కోర్టుకు రావాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులో 33 పార్టీలను ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. చట్టం ప్రకారం ఇంత మందికి అనుమతి ఉండదని అన్నారు.
"ఇదొక లోపభూయిష్టమైన వ్యాజ్యం. మీడియా పబ్లిసిటీ కోసమే దీన్ని దాఖలు చేశారు. అంతకుమించి ఇంకేమీ లేదు. 'నాకు 1 నుంచి 8 పేరాల వరకే కేసు గురించి అవగాహన ఉంది' అని పిటిషనర్లు చెబుతున్నారు. పిటిషనర్‌కు వ్యాజ్యంపై వ్యక్తిగతంగా అవగాహన లేదు. ఇది ఆశ్చర్యకరం. ఇదెలా జరుగుతుంది? 'నాకేం తెలీదు మీరే విచారణ జరుపుకోండి' అని చెప్పే ఫిర్యాదుదారులను మేము ఇంతవరకు చూడలేదు."
-జస్టిస్ జేఆర్ మిధా, దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
కేంద్ర టెలికాం శాఖ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడ్వొకేట్ అమిత్ మహాజన్.. పిటిషనర్ల వాదనను తప్పుబట్టారు. 5జీ విధానం పబ్లిక్ న్యూసెన్స్ కిందకు రాదని స్పష్టం చేశారు. సాంకేతికతే తప్పు అని పిటిషనర్లు నిరూపించాల్సిన అవసరం ఉందని మెహతా వ్యాఖ్యానించారు. ఇదో తప్పుడు వ్యాజ్యమని కొట్టిపారేశారు.
ప్రైవేటు టెలికాం సంస్థల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. 5జీ సాంకేతికత ప్రవేశపెట్టడం అనేది ప్రభుత్వ విధానపర నిర్ణయమని, అదేమీ తప్పు కాదని అన్నారు. 5జీ సాంకేతికతను నిలిపివేయాలంటే.. ఈ విధానమే తప్పు అని వారు నిరూపించాలని పేర్కొన్నారు.
చావ్లా వ్యాజ్యంపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.
పాటలు
కాగా, వర్చువల్‌గా జరిగిన ఈ విచారణకు ఓ వ్యక్తి పదేపదే అంతరాయం కలిగించాడు. లైవ్ విచారణలో పాల్గొన్న ఆ వ్యక్తి.. జూహీ చావ్లా నటించిన సినిమాల్లోని పాటలు పాడాడు. ఆ వ్యక్తిని గ్రూప్ నుంచి డిలీట్ చేసినప్పటికీ.. మళ్లీ విచారణలో పాల్గొని పాటలు పాడాడు. ఇలా మూడుసార్లు జరిగింది.
ఆసక్తి ఉన్నవారు వర్చువల్ విచారణకు హాజరుకావాలని మంగళవారం రాత్రి జూహీ చావ్లానే స్వయంగా లింక్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు.
కాగా, ఈ ఘటనపై న్యాయమూర్తి జస్టిస్ మిధా తీవ్రంగా స్పందించారు. విచారణకు అంతరాయం కలిగించిన వ్యక్తిని గుర్తించాలని దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ వ్యక్తికి కోర్టు ధిక్కరణ నోటీసులు పంపిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన చావ్లా తరపు న్యాయవాది.. ఆ వ్యక్తి ఇప్పటికే రేడియేషన్ బారిన పడి ఉంటాడని సరదాగా వ్యాఖ్యానించారు.
వ్యాజ్యం ఎందుకంటే?
5జీ సాంకేతికత వల్ల పౌరులు, వృక్ష, జంతుజాలంపై తీవ్ర రేడియేషన్ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు జూహీ చావ్లా. 5జీ ఏర్పాటుకు టెలీకమ్యూనికేషన్ పరిశ్రమ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే.. భూమిపై ఉన్న ఏ ఒక్క జీవజాలం కూడా రేడియేషన్ బారి నుంచి తప్పించుకోలేదని అన్నారు.
ఆర్ఎఫ్ రేడియేషన్ స్థాయి ఇప్పుడున్న దాని కన్నా 10 నుంచి 100 రెట్లు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణంపై కోలుకోలేని దెబ్బ పడుతుందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మానవాళితో పాటు యావత్ వృక్ష, జంతుజాలానికి 5జీ సాంకేతికత సురక్షితమేనని అధికారులు ధ్రువీకరించేలా ఆదేశాలివ్వాలని కోరారు.
ఇదీ చదవండి- యూపీ భాజపాలో లుకలుకలు- యోగికి పార్టీ మద్దతు