IT Employees Protesting Chandrababu Arrest : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు(Chandrababu Arrest)కు మద్దతుగా ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆందోళనలకు సిద్ధమయ్యారు. హైటెక్ సిటీ సైబర్ టవర్(Hi tech city) వద్ద ఆందోళనకు ఐటీ ఉద్యోగులు యత్నించారు. దీంతో సైబర్ టవర్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఈ ప్రదేశంలో ఎలాంటి ఆందోళనలు చేయవద్దంటూ.. ఐటీ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. సైబర్ టవర్ పరిసరాల్లో యువత ఐడీలను చెక్ చేస్తున్నా పోలీసులు తనిఖీ చేశారు. ఐటీ ఉద్యోగి అయితే కార్యాలయానికి వెళ్లిపోవాలంటూ సూచనలు చేశారు. చంద్రబాబుకు మద్దతుగా వస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక ఉద్యోగిని అదుపులోకి తీసుకునే క్రమంలో మహిళా కానిస్టేబుల్ తలకు చిన్నపాటి గాయమైంది. ఐటీ కంపెనీల నుంచి ఉద్యోగులను బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
IT Employees Protest in Hyderabad Over Chandrababu Arrest : స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ.. బుధవారం హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్, కేపీహెచ్బీ వద్ద ఐటీ ఉద్యోగులు భారీగా చేరి నిరసనలు తెలిపారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేశారన్నారు. దేశంలోనే విజన్ ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబునేనని కొనియారు.
ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ నినాదాలు : సైకో పోవాలి- సైకిల్ రావాలంటూ ఆ రెండు ప్రదేశాల్లో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు నినాదాలు చేశారు. విప్రో సర్కిల్ వద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. ఐయామ్ విత్ సీబీఎన్ ప్లకార్డులతో విప్రో సర్కిల్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డువరకు ర్యాలీగా తరలివెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం నెలకొంది. వెంటనే చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు ఉపసంహరించుకొని.. ఆయనను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైటెక్ రూపకర్త జైలు నుంచి విడుదలయ్యే వరకు తామంతా పోరాడతామని ముక్త కంఠంతో చెప్పారు. ఆయన వల్లే ఈరోజు తామీస్థాయిలో ఉన్నామని వాపోయారు. భారీగా అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని నిలువరించి.. వెనక్కి పంపారు.
IT Employees Protest in Hyderabad : ఎవరినైనా అరెస్టు చేస్తే వారి తప్పులు బయటకు వస్తాయి.. కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు అయితే ఆయన మంచితనం బయటకు వస్తుందని ఐటీ ఉద్యోగులు పేర్కొన్నారు. ఇప్పుడు ఐటీ ఉద్యోగులంతా ఆయన కోసం జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా ఏంటో చూపిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అసలు వైసీపీ నాయకులకు విజన్ అంటే ఏమిటో తెలుసా అంటూ ధ్వజమెత్తారు. అసలు ఏపీలో నాలుగేళ్లు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మరోవైపు కేపీహెచ్బీ నుంచి జేఎన్టీయూ వరకు శాంతియుతంగా ఐటీ ఉద్యోగులు ర్యాలీని నిర్వహించారు. వీ వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులను పట్టుకొని.. భారీగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కదం తొక్కారు.