అనుకోని ప్రమాదంలో రెండు కళ్లను కోల్పోయి అంధురాలైంది ఓ యువతి. దీంతో చదువుకోవాలని ఆశ ఉన్న ఆమెకు దిక్కుతోచలేదు. ఇక తన గతి ఇంతేనంటూ కుంగిపోతున్న సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెకు ఆపన్న హస్తం అందించింది. బ్రెయిలీ లిపి ద్వారా చదువు చెప్పించింది. వచ్చిన అవకాశాన్ని కష్టనష్టాలకోర్చి ఉపయోగించుకుని పట్టువిడవకుండా చదివి.. పన్నెండో తరగతి పరీక్షలో మంచి ప్రతిభ కనిబర్చింది. 500 మార్కులకు 319 మార్కులు సాధించి ఫస్ట్ డివిజన్‌లో పాసైంది. భవిష్యత్తులో ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని తెలిపింది. పట్టుదలతో తన ఆశయం వైపు అడుగులేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ యువతి కథ ఇదే.
22 ఏళ్ల ఇన్షా ముస్తాక్.. జమ్ముకశ్మీర్ షోపియన్ జిల్లా సీడో గ్రామానికి చెందిన యువతి. 2016లో ఆ గ్రామంలో జరిగిన ఓ అల్లర్ల ఘటన ఆమె జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది. అప్పటి వరకు ఇంట్లో అందరితో కలిసి ఆనందంగా గడిపిన ఇన్షా.. బయట చెలరేగిన ఘర్షణనను చూద్దామని ఇంటి కిటికీని తెరిచింది. ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో భద్రతా దళాలు ప్రయోగించిన బుల్లెట్ పెల్లెట్స్.. క్షణాల్లో దూసుకొచ్చి ఆమె కళ్లను తాకాయి. తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిన ఇన్షాను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు.. ఇన్షా చూపు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. జీవితంలో ఉన్నత స్థాయి చేరుకోవాలన్న తన కల.. ఈ ఘటనతో కలలానే మిగిలిపోయిందని ఇన్షా బాధపడిపోయింది.
"నేను అంధురాలయ్యాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయితే ఆ కష్టాలకు నేను కుంగిపోలేదు. ఆ సవాళ్లన్నింటినీ పట్టుదలతో ఎదుర్కొన్నాను. పదో తరగతి పాసయ్యాక.. శ్రీనగర్‌లోని దిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత కంప్యూటర్, ఇంగ్లీష్ మాట్లాడడంలో మూడేళ్ల కోర్సు తీసుకున్నా. 2021లో 11వ తరగతి పాసయ్యా. ఆశ కోల్పోవద్దని, పట్టుదలతో చదవి స్వతంత్రంగా జీవించాలని మా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహించారు. జమ్ముకశ్మీర్ సెంటర్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (JKCPJ) స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నాదిర్ అలీ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన 2018 నుంచి నాకు పునరావాసం కల్పించారు. నాకు విద్యను అందించారు. అంధ విద్యార్థుల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయాల్సివ అవసరం ఉంది. జీవితంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొవాలన్నదే నేను యువతకు ఇచ్చే సందేశం"
--ఇన్షా ముస్తాక్, అంధ విద్యార్థిని
ఇన్షా ముస్తాక్ పరిస్థితిని చూసిన ఆమె కుటుంబ సభ్యులు కూడా మొదట్లో బాధపడ్డారు. ఇక తమ కూతురిని ఉన్నత స్థాయిలో చూడలేమని అనుకున్నారు. విషయం తెలుసుకున్న JKCPJ స్వచ్ఛంద సంస్థ వారికి అండగా నిలబడింది. కంటి చూపు కోల్పోయిన ఇన్షాకు బ్రెయిలీ లిపి ద్వారా చదువు చెప్పించింది. అలా చూపు కోల్పోయిన రెండేళ్లలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. పట్టువిడవకుండా శ్రద్ధతో చదివిన ఇన్షా ముస్తాక్ పన్నెండో తరగతిలో మొదటి డివిజన్‌లో పాసయ్యింది. ఈ ఫలితాలతో వారి కుటుంబ సభ్యులు ఉబ్బితబ్బిబవుతున్నారు. భవిష్యత్తులో ఇన్షాను ఐఏఎస్ చేయాలనేది తమ కోరిక అని ఆమె తండ్రి ముస్తాక్ అహ్మద్ అన్నారు.