కొవిడ్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి వేగాన్ని తెలియజెప్పే ఆర్-ఫ్యాక్టర్ (రీ ప్రొడక్షన్ రేట్) దేశంలో క్రమేపీ పెరుగుతోంది. ఇది 1కి చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా కేరళతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. మెట్రో నగరాలైన పుణె, దిల్లీల్లోనూ ఆర్-ఫ్యాక్టర్ పెరుగుతున్నట్లు చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పరిశోధకులు తెలిపారు.
మళ్లీ పెరుగుదల..
దేశంలో కొవిడ్ రెండో ఉద్ధృతి అత్యంత తీవ్రదశలో ఉన్నప్పుడు (మార్చి 9 - ఏప్రిల్ 21 మధ్య) ఆర్-ఫ్యాక్టర్ 1.37గా ఉండేది. అనంతరం క్రమేపీ తగ్గుతూ మే 15 - జూన్ 26 మధ్య కాలంలో 0.78కి చేరింది. జులైలో మళ్లీ పెరుగుదల మొదలైంది. జులై 3 - 22 మధ్య ఇది ఏకంగా 0.95కి పెరగడం ఆందోళనకరం. కొవిడ్ బారిన పడిన వారి నుంచి వైరస్ ఇతరులకు సంక్రమించే తీరును ఆర్-ఫ్యాక్టర్ తెలుపుతుంది. ఉదాహరణకు ఇది 0.95 ఉందంటే.. కొవిడ్ సోకిన ప్రతి 100 మంది ద్వారా ఇన్‌ఫెక్షన్ మరో 95 మందికి సోకుతుందని అర్థం. అదే 1 దాటితే పరిస్థితి తీవ్రమవుతుంది. కేరళలో ఆర్-ఫ్యాక్టర్ ఏకంగా 1.11 ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర, మణిపుర్ మినహా మిగిలిన అన్నిచోట్ల 1 దాటింది. మణిపుర్‌లో కూడా 1కి చేరువగా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఉత్తరాఖండ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో వచ్చే రెండు వారాల్లో కొవిడ్ వ్యాప్తి ఈ ప్రాంతాల్లో పెరిగే ప్రమాదం ఉందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ బృందానికి నేతృత్వం వహిస్తున్న సితభ్ర సిన్హా తెలిపారు.
24 గంటల్లో 43,509 మందికి కొవిడ్
దేశంలో కొవిడ్ రోజువారీ కేసుల సంఖ్య గురువారం కూడా 43 వేలు దాటింది. వరుసగా రెండో రోజు క్రియాశీలక కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వీటి సంఖ్య మళ్లీ 4 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 43,509 కొత్త కేసులు బయట పడగా.. 640 మంది కొవిడ్‌తో మృతి చెందారు.
కేరళకు నేడు ప్రత్యేక బృందం
దేశంలోని మొత్తం క్రియాశీలక కేసుల్లో 37% (1.54 లక్షలు) ఉన్న కేరళకు కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని పంపుతోంది. వ్యాధుల నియంత్రణ జాతీయ కేంద్రం (ఎన్‌సీడీసీ) డైరెక్టర్ ఎస్.కె.సింగ్ నేతృత్వంలోని ఈ బృందం శుక్రవారం కేరళకు చేరుకొని పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పర్యటిస్తుంది.
తిరువనంతపురం: వరుసగా మూడో రోజు (గురువారం) కేరళలో 22 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు ఏకంగా 13.53 శాతం నమోదైంది.
ఇదీ చదవండి: కేరళలో కరోనా విజృంభణ- మూడో దశకు సంకేతమా?