"మీ అబద్ధపు హామీలు వినీవినీ మా తరం విసిగిపోతోంది. మీపై కోపం వస్తోంది. కానీ అందుకు నా దగ్గర టైం లేదు. మీరు చేయలేకపోయినా కనీసం మేమైనా మా భవిష్యత్తును నిర్మించుకోవాలి కదా. ప్రపంచ నేతలారా దయచేసి మాతో కలిసి రండి". మారుతున్న వాతావరణ పరిస్థితులపై (vinisha umashankar speech) తన ఆవేదన వెళ్లగక్కింది 14ఏళ్ల వినీశా ఉమాశంకర్. గ్లాస్గో వేదికగా జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సు(కాప్26)లో ఈ భారతీయ బాలిక చేసిన ప్రసంగం.. యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది.
ఎవరీ వినిశా ఉమాశంకర్..?
తమిళనాడులోని (vinisha umashankar india) తిరువణ్ణమలై జిల్లాకు చెందిన వినీశా ఉమాశంకర్.. చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి తిరిగొచ్చే సమయంలో రోడ్డు పక్కన బట్టలు ఇస్త్రీ చేసే వాళ్లను చూసేది వాళ్లు వాడే బొగ్గు, దాని వల్ల జరుగుతున్న కాలుష్యం గురించి ఆలోచించేది. ఓ సమయంలో ఆ చిట్టి బుర్రకు చిన్న ఆలోచన తట్టి ఆవిష్కరణ మొదలుపెట్టింది. అలా 12ఏళ్ల వయసులోనే సౌరశక్తితో పనిచేసే ఐరనింగ్ బండిని రూపొందించింది. ఆ ఆవిష్కరణతో బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ విలియమ్స్ ప్రారంభించిన 'ఎర్త్‌షాట్ ప్రైజ్' పోటీలకు వెళ్లి ఫైనల్ వరకు చేరింది. అలా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన వినీశా.. తాజాగా ప్రిన్స్ విలియమ్స్ ఆహ్వానం మేరకు కాప్26 సదస్సులో పాల్గొని 'క్లీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్' అనే అంశంపై ప్రసంగించింది.
నేను పుడమి పుత్రికను..
మన దేశ ప్రధాని నరేంద్రమోదీ, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వంటి ప్రపంచ నేతలు హాజరైన ఈ సమావేశంలో వినీశా ఏ మాత్రం బెదరకుండా (vinisha umashankar cop26 speech) తన అభిప్రాయాలను ధైర్యంగా చెప్పింది. పుడమిని కాపాడండి అంటూ ప్రపంచ నేతలను అభ్యర్థించింది. "ఖాళీ వాగ్దానాలు చేస్తూ.. వాటిని నెరవేర్చడంలో విఫలమవుతున్న ప్రపంచ నేతలపై ఈ రోజు మా తరంలోని చాలా మంది విసుగుతో ఉన్నారు. మీపై కోపం తెచ్చుకునేందుకు మా దగ్గర అనేక కారణాలున్నాయి. కానీ అందుకు నాకు సమయం లేదు. నేను పనిచేయాలనుకుంటున్నా. ఎందుకంటే నేను కేవలం భారత బాలికను కాదు. ఈ పుడమితల్లి పుత్రికను. అందుకు నేను గర్విస్తున్నాను. నేను ఓ విద్యార్థిని, పర్యావరణవేత్తను, అంతకంటే మించి ఓ ఆశావాదిని. ఇప్పుడు నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నది ఒకటే.. మాటలు వద్దు. చేతలు కావాలి. శిలాజ ఇంధనాలు, కాలుష్యంపై ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవద్దు. పాత పద్ధతులు ఇకనైనా ఆపేద్దాం. ఎందుకంటే నవతరం కోసం కొత్త దృక్పథం కావాలి. అందువల్ల మా వినూత్న సృజనలు, ఆవిష్కరణలపై మీ సమయాన్ని, డబ్బును వెచ్చించండి. మా బంగారు భవిత కోసం ప్రయత్నాలు చేయండి. పాత అలవాట్లను ఇకనైనా వదిలిపెట్టండి. లేదు.. మేం అక్కడే ఆగిపోతాం అన్నా ఫర్వాలేదు. మా భవిష్యత్తును మేం నిర్మించుకుంటాం. అందుకోసం దయచేసి మాతో చేతులు కలపండి" అంటూ వినీశా ఉద్విగ్నభరిత ప్రసంగం చేసింది. ఆమె మాటలతో సభావేదిక కరతాళ ధ్వనులతో మార్మోగింది.
ఏంటీ 'ఎర్త్‌షాట్ ప్రైజ్'..?
భూగోళం ఎదుర్కొంటోన్న వాతావరణ సవాళ్లకు యువ, సృజనాత్మక ఆవిష్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రిన్స్ విలియమ్స్ గతేడాది ఈ పోటీలను ప్రారంభించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ మొదలుపెట్టిన మూన్‌షాట్ ప్రాజెక్టు స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసేవారికి ఈ ప్రైజ్‌ను ఇస్తున్నారు. ఈ ప్రైజ్‌లో ఐదు విభాగాలు ఉన్నాయి. 1) ప్రకృతిని కాపాడటం, పునరుద్ధరించడం, 2) గాలిని శుద్ధి చేయడం, 3) సముద్రాలను పునరుద్ధరించడం, 4) వ్యర్థరహిత ప్రపంచాన్ని నిర్మించడం, 5) వాతావరణాన్ని సమతుల్యపర్చడం. ఏటా ఈ ఐదు అంశాల్లో విశేషంగా కృషి చేసిన ఐదుగురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 1మిలియన్ పౌండ్ల(దాదాపు రూ.9.5కోట్లు)చొప్పున 'ఎర్త్‌షాట్' ప్రైజ్ ఇస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన పోటీల్లో దిల్లీకి చెందిన విద్యుత్ మోహన్ విన్నర్‌గా నిలవగా..వినీశా ఉమాశంకర్ ఫైనలిస్ట్‌గా నిలిచింది.
ఇదీ చదవండి:'2070 నాటికి కర్బన ఉద్గారాల రహితంగా భారత్'