అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లతో చర్చల విషయంలో భారతదేశం విశాల హృదయంతో వ్యవహరించాలని, కాబుల్‌లోని మన ఎంబసీని పునరుద్ధరించి రాయబారిని అక్కడకు పంపాలని విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా అభిప్రాయపడ్డారు. పీటీఐ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
అఫ్గాన్ ప్రజలు పాక్ కంటే భారత్‌ను ఎక్కువగా ప్రేమిస్తారన్న విషయాన్ని మనం గమనించాలన్నారు. తాలిబన్లు పాకిస్థాన్ ఒడిలో ఉన్నారన్న భావనతో భారత ప్రభుత్వం తలుపులు మూసివేయకూడదని చెప్పారు. పెద్ద దేశంగా ఉన్న మనమే తాలిబన్లను విశ్వాసంలోకి తీసుకొని పరిస్థితులను చక్కదిద్దేందుకు కృషి చేయాలని, పాక్ ప్రభావమే ఎక్కువగా ఉంటుందన్న అనుమానాలు విడిచి పెట్టాలన్నారు.
అఫ్గాన్‌పై తాలిబన్లు దాదాపుగా పూర్తి పట్టు సాధించారన్న సిన్హా.. ఈ దశలో కొత్త పాలకులను గుర్తించడంలో కానీ, తిరస్కరించడంలో కానీ తొందరపాటు తగదని చెప్పారు. వేచి చూసే ధోరణే మంచిదన్నారు. తాలిబన్లు ఇపుడు చేస్తున్న ప్రకటనల్లో పరిణతి కనిపిస్తున్నందున, వారి వైఖరి మారి ఉండవచ్చన్నారు.
ఇదీ చూడండి: 'తాలిబన్ల విషయంలో వేచి చూసే ధోరణే భారత్‌కు ఉత్తమం'