సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులతో ఎటువంటి అనధికారిక చర్చలు జరపలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. భారీగా బారికేడ్లను ఏర్పాట్లు చేయడం, ఆందోళన ప్రాంతాల్లో అంతర్జాల సేవలు నిలిపివేయడం, శాంతి భద్రతలు.. స్థానిక పాలనా యంత్రాంగానికి సంబంధించి అంశాలని పేర్కొన్నారు.
"ప్రభుత్వం తదుపరి చర్చలు ఎప్పుడు నిర్వహిస్తుంది? రైతు సంఘాలతో అనధికారికంగా చర్చలు జరుపుతుందా?" అని తోమర్‌ను పీటీఐ వార్తా సంస్థ ప్రశ్నించగా.. "అటువంటిదేమీ లేదు. రైతులతో చర్చలు జరిపినప్పుడు తెలియజేస్తాం" అని బదులిచ్చారు.
గతంలో కేంద్రానికి రైతుల మధ్య 11 సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది.
'వేధింపులు ఆపాలి'
అక్రమంగా అదుపులోకి తీసుకున్న రైతులను విడుదల చేసే వరకు ప్రభుత్వంతో చర్చలు జరపమన్న రైతులు సంఘాలు.. పోలీసులు, పాలనాయంత్రాంగం తమను వేధించడం ఆపాలని కోరాయి. దీనిపై స్పందించిన తోమర్.. "రైతులే.. పోలీసు కమిషనర్‌తో మాట్లాడాలి. నేను శాంతిభద్రతల విషయంలో జోక్యం చేసుకోదలుచుకోలేదు. అది నా బాధ్యత కాదు" అని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: బడ్జెట్‌తో 99% మందికి అన్యాయం: రాహుల్