ప్రఖ్యాత పూరీ రథయాత్రకు ముందు నిర్వహించే దేవస్నాన పూర్ణిమ క్రతువు అత్యంత వైభవోపేతంగా సాగింది. ముగ్గురు దేవతామూర్తులు... జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలకు స్నానఘట్టం నిర్వహించారు. సాధారణంగా లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని కొద్ది మంది సమక్షంలోనే జరిపించారు. రాజు దివ్యసింగ్‌దేవ్, పూజారులు, దేవస్థాన అధికారులు మాత్రమే ఈ క్రతువులో పాల్గొన్నారు.


ముందు జాగ్రత్త చర్యగా దేవస్నాన పూర్ణిమ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. వచ్చే నెల 12న పూరీ రథయాత్ర జరగనుంది. ఈసారి భక్తులు లేకుండానే రథయాత్ర సాగనుంది. రథయాత్ర కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పూరి దేవస్థానం వర్గాలు తెలిపాయి.


కరోనా కారణంగా అనేక వారాల పాటు మూసి ఉన్న ఆలయం.. జూన్ 25న భక్తుల కోసం తెరుచుకోనుంది. రెండు డోసులు తీసుకున్న వ్యక్తులకు మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉంటుందని ఆలయ అధికారి డా. కృష్ణన్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: ఐస్‌క్రీం పుల్లలతో పూరీ జగన్నాథుని ప్రతిమ!