Goregaon Fire Accident Today : మహారాష్ట్ర.. ముంబయిలోని గోరెగావ్‌లో ఏడు అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. శుక్రవారం వేకువజామున 3గంటలకు జరిగిందీ దుర్ఘటన.
గోరెగావ్ వెస్ట్‌లోని ఆజాద్ నగర్ ప్రాంతంలో ఏడు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగిందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరిని జోగేశ్వరిలోని ట్రామా సెంటర్‌కు, మరికొందరిని జుహులోని సివిక్-రన్ కూపర్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని అన్నారు. అగ్ని ప్రమాదంలో 30 వాహనాలు దగ్ధమయ్యాయని వెల్లడించారు. ఎనిమిది అగ్నిమాపక యంత్రాలతో నాలుగు గంటలు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చిందని పేర్కొన్నారు.
తెల్లవారుజామున 3గంటల సమయంలో భవనంలో పెద్ద పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుడు విని నిద్ర లేచేసరికే.. మంటలు వ్యాపించాయని తెలిపారు. వెంటనే ఇంట్లోనుంచి బయటకి వెళ్లిపోయామని అన్నారు.
మరోవైపు.. గోరెగావ్ అగ్ని ప్రమాదంపై బీజేపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. 'గోరెగావ్ అగ్నిప్రమాదం గురించి తెలిసి బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటాం.' అని ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్లో చేశారు. మరోవైపు, గోరెగావ్ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని గోరెగావ్ ఎమ్మెల్యే విద్యా ఠాకూర్ తెలిపారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.