Girls Eating Contaminated Food Sick In Wanaparthy : కలుషిత ఆహారం తిని విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన వనపర్తి జిల్లాలో కలకలం సృష్టించింది. రాత్రి తీసుకున్న భోజనం వికటించి 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ ఉదయం సమీపంలోని ఆత్మకూరు ఆస్పత్రిలో చికిత్స అందించగా.. వీరిలో 8 మంది పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో వీరిని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేజీబీవీని అధికారులు, పోలీసులు పరిశీలించి.. ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.
వనపర్తిలోని అమరచింత కస్తూర్బా విద్యాలయంలో మొత్తం 271 మంది విద్యార్థినులు చదువుతుండగా.. గురువారం 211 మంది హాజరయ్యారు. వీరికి నిన్న రాత్రి సిబ్బంది వంకాయ, సాంబారుతో కూడిన ఆహారాన్ని వడ్డించారు. రాత్రి భోజనం అయ్యాక 11గంటల ప్రాంతంలో విద్యార్థినులకు కడుపు నొప్పి మొదలు కావటంతో.. ఒక్కొక్కరుగా సిబ్బంది వద్దకు వెళ్లారు. కేజీబీవీలో ఒక టీచర్, వాచ్‌మెన్ మాత్రమే ఉండటంతో రాత్రి విద్యార్థినులకు బయటికి పంపలేదు. రాత్రంతా పరిస్థితి అలాగే ఉండటంతో తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఆటో తీసుకువచ్చిన విద్యార్థులందరిని సమీపంలోని ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
- 13 Years Girl Raped In Nizamabad : చేతులు కాళ్లు కట్టేసి.. నోటిలో గుడ్డలు కుక్కి.. బాలికపై అత్యాచారం
చికిత్స పొందుతున్న బాలికలు : బాలికలందరికీ వైద్యులు, సిబ్బంది హుటాహుటీన చికిత్స ప్రారంభించగా.. చాలా వరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. 8మందికి మాత్రం కడుపు నొప్పి తగ్గకపోవటంతో.. వీరిని వనపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆత్మకూరులోని ఆసుపత్రికి చేరుకున్నారు. తమ పిల్లల పరిస్థితిని వారు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని.. వైద్యులు చెబుతున్నారు. అస్వస్థతకు గురైన వారిలో 9, 10, ఇంటర్ విద్యార్థినిలే ఎక్కువగా ఉన్నారు. ఆహారం విషతూల్యం కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని బాలికలు వాపోతున్నారు. ఆసుపత్రిలో విద్యార్థినుల రోదనలు మిన్నంటాయి.
విచారణ చేస్తున్న పోలీసులు, అధికారులు : కేజీబీవీలో కలుషితాహారం కలకలంరేపడంతో అధికారులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. రాత్రి వండిన ఆహార పదార్థాలను పరిశీలించి, అక్కడి విద్యార్థులతో పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆహారం కలుషితం జరిగిందా.. లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి :