విమానంలో పుట్టిన ఓ శిశువు జనన ధ్రువీకరణ పొందేందుకు తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఏ ఆస్పత్రికి దరఖాస్తు చేసినా తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగిందంటే?
రాజస్థాన్‌కు చెందిన ఓ నిండు గర్భిణి.. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున వైద్యుడి సలహాతో అత్యవసర ప్రయాణం చేయాల్సి వచ్చింది. గత నెల 17న.. బెంగళూరు నుంచి జైపుర్‌కు వెళ్లేందుకు ఇండిగో ఫ్లైట్(6ఈ-469)లో ప్రయాణించారు. విమానం గాల్లోకి ఎగిరిన క్రమంలో పురిటినొప్పులు వచ్చాయి. తక్షణమే స్పందించిన విమాన సిబ్బంది ఎవరైనా వైద్యులు ఉంటే.. సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వాయువ్య రైల్వే(ఎన్‌డబ్ల్యూఆర్)కు చెందిన ఓ వైద్యుడి సాయంతో ఆమె ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది. జైపుర్ విమానాశ్రయానికి చేరాక.. తల్లీబిడ్డలను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
అయితే.. ఇప్పుడు ఆ చిన్నారి తల్లిదండ్రులు జనన ధ్రువీకరణ పత్రం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వారు ఏ ఆసుపత్రికి వెళ్లినా నిరాశే ఎదురవుతోంది. సాయం కోసం విమానయాన సంస్థను సంప్రదించినా.. వారి నుంచి ఎలాంటి సమాధానం రావటం లేదని బాలిక తండ్రి వాపోయారు.
ఇదీ చదవండి: ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్