పంజాబ్లో ఓ వీడియో స్థానికంగా కలకలం రేపింది. ఓ యువకుడిని నలుగురు యువతులు కిడ్నాప్ చేసి.. అత్యాచారాని పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధితుడు ఓ వీడియో ద్వారా తెలిపాడు. దీంతో ఈ వీడియో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
జలంధర్లో కపుర్తలా రోడ్డులోని ఓ లెదర్ కాంప్లెక్సులో పని ముగించుకుని.. ఓ యువకుడు ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా కారులో వచ్చిన అమ్మాయిలు, మత్తుమందు చల్లి అతడిని కిడ్నాప్ చేశారు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. మద్యం మత్తులో ఉన్న యువతులు.. ఆ యువకుడిని కూడా మద్యం తాగాలని బలవంతం చేశారు. ఆపై అతడిని తాళ్లతో కట్టి.. అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అదే కారులో వచ్చి, ఓ ప్రదేశంలో రోడ్డుపై విడిచి వెళ్లారు. ఈ మేరకు బాధితుడు ఓ వీడియో విడుదల చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన పరువు పోతుందని.. అందుకే ఫిర్యాదు చేయలేదని తెలిపాడు.
ఈ వార్తలపై జలంధర్ డీసీపీ జగన్మోహన్ సింగ్ స్పందించారు. అలాంటి కేసు ఏదీ తమ వద్దకు రాలేదని అన్నారు. దానిపై ఏ పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు అందలేదని తెలిపారు. వార్తా కథనాల ప్రకారం ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పారు.