Farmers Protest: నిరసనలు ఆపితేనే రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామన్న కేంద్రం ప్రతిపాదనను సంయుక్త కిసాన్ మోర్చా తప్పుపట్టింది. ఇందుకు సంబంధించి బుధవారం జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. డిమాండ్లకు అంగీకరించినా.. కేంద్రం మంగళవారం పంపిన ప్రతిపాదనలో తమకు పలు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. అదే విషయాన్ని మరో లేఖ ద్వారా కేంద్రానికి తెలిపినట్లు వెల్లడించింది సంయుక్త కిసాన్ మోర్చా.
నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన 700 మంది కుటుంబసభ్యులకు నష్టపరిహారం ఇప్పించే విషయంలో కేంద్రం పంజాబ్ ప్రభుత్వ విధానాన్ని అనుసరించాలి. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు సహా ఉద్యోగాన్ని ఇప్పించాలి.
-గుర్నామ్ సింగ్, బీకేయూ
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రతిపాదనకు కూడా రైతు సంఘాలు అభ్యంతరం తెలిపాయి. సంయుక్త కిసాన్ మోర్చాతో సంబంధం లేని రైతు సంఘాలను ఈ కమిటీలో ప్రభుత్వం భాగం చేస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. మొదటి నుంచి తమ డిమాండ్లకు వ్యతిరేకంగా ఉన్న కమిటీ సభ్యులను ఇందులో భాగం చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : 'వారి సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం.. నిరసనలు కొనసాగిస్తాం'