కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్‌కు ఆదివారం నిరసన సెగ తగిలింది. ఆయన కారుపై మాజీమంత్రి రమేశ్ జార్ఖిహోళి అభిమాని ఒకరు చెప్పు విసిరారు. కొందరు రాళ్లు రువ్వారు. ఆదివారం మధ్యాహ్నం డి.కె. శివకుమార్ బెళ్గాం విమానాశ్రయం నుంచి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దారిలో రమేశ్ జార్ఖిహోళి అభిమానులు డి.కె వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
కర్ణాటక మాజీమంత్రి రమేశ్ జార్ఖిహోళి సీడీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని డి.కె శివకుమార్ పేర్కొన్నారు. బెంగళూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీడీలో కనిపించిన యువతి తల్లిదండ్రులు తనకు వ్యతిరేకంగా ఇచ్చిన ప్రకటనకు ఆందోళన చెందడం లేదని స్పష్టం చేశారు. దర్యాప్తు పూర్తయితే దోషులు ఎవరనేది బయటపడుతుందన్నారు.
సీడీలో కనిపించిన యువతి సోమవారం న్యాయస్థానంలో నేరుగా హాజరవుతారని ఆమె తరపు న్యాయవాది జగదీశ్ ప్రకటించారు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్‌కు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరినట్లు చెప్పారు. తమ ముందు విచారణకు హాజరుకావాలని ప్రత్యేక దర్యాప్తు దళం అయిదుసార్లు నోటీసులు జారీచేసినా ఆ యువతి స్పందించలేదు.
ఇదీ చదవండి: 'అమిత్ షా-పవార్ల మధ్య భేటీ జరగనేలేదు'