Delhi excise policy case: దిల్లీ ఎక్సైజ్ విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసులో తనపై లుక్‌ఔట్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా. తాను దేశం విడిచి వెళ్లకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 15మందిలో ముగ్గురిని శనివారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కేసు వివరాలను ఈడీ అధికారులకు అందజేశారు. ఆ తర్వాత లుక్‌ఔట్ నోటీసులు జారీపై సిసోదియా ప్రకటన ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
లుక్‌ఔట్ జారీ చేయలేదన్న సీబీఐ: దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా లుక్‌ఔట్ నోటీసులపై చేసిన వ్యాఖ్యలను ఖండించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఇప్పటి వరకు తాము ఎలాంటి లుక్‌ఔట్ నోటీసులు జారీచేయలేదని స్పష్టం చేసింది. నోటీసుల జారీ ప్రక్రియ కొనసాగుతోందని.. త్వరలోనే జారీ చేస్తామని సీబీఐ వెల్లడించింది.
సవాల్ విసిరిన సిసోదియా: లుక్‌ఔట్ నోటీసులపై సిసోదియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీబీఐ తనిఖీలన్నీ విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. తన ఇంట్లో ఒక్క పైసా కూడా లభించలేదని తెలిపారు. ఇప్పుడు తాను కనిపించడం లేదంటూ లుక్‌ఔట్ నోటీసులు జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ''ఇవేం నాటకాలు?'' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఘాటుగా ప్రశ్నించారు. తాను దిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నానన్నారు. ఎక్కడికి రావాలో చెప్పాలని సవాల్ విసిరారు.
సీబీఐ, ఈడీతోనే రోజు మొదలు: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం కేంద్రం తీరుపై మండిపడ్డారు. దేశమంతా నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో బాధపడుతుంటే.. కేంద్రం మాత్రం రాష్ట్రాలతో గొడవ పడుతోందని ఆరోపించారు. ప్రతి రోజు ఉదయం సీబీఐ, ఈడీతో ఆట మొదలుపెడుతున్నారని.. ఇలా చేస్తే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అని ప్రశ్నించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం మనీష్ సిసోదియా నివాసం సహా దేశంలో ఏడు రాష్ట్రాల్లో 31 చోట్ల సోదాలు నిర్వహించింది. సిసోదియా అనుచరుడి కంపెనీకి మద్యం వ్యాపారి ఒకరు రూ.కోటి చెల్లించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. దిల్లీ ఎక్సైజ్ విధానంతో ముడిపడిన ఈ సోదాలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భాజపా మధ్య మాటల యుద్ధం మొదలైంది. తమ ప్రభుత్వానికి ఆదరణ పెరగడాన్ని ఓర్వలేక కేంద్రం ఇలా భయపెట్టాలని చూస్తోందని ఆప్ విమర్శించింది. పంజాబ్‌లో ఆప్ విజయం తర్వాత కేంద్రంలోని భాజపా ప్రభుత్వ పెద్దల్లో భయం పట్టుకుందని, కేజ్రీవాల్ ఉన్నతిని నిలువరించాలన్న కుట్రలో భాగంగానే సీబీఐ, ఈడీ దాడులు జరుగుతున్నాయంటూ సిసోదియా ధ్వజమెత్తారు. మరోవైపు మద్యం కుంభకోణంలో అసలు సూత్రధారి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు.
ఇవీ చూడండి: కూలీకి జాక్పాట్, దారిలో వెళ్తుండగా దొరికిన వజ్రం, రాత్రికి రాత్రే లక్షాధికారిగా