కర్ణాటక బెంగళూరులో డ్రగ్స్ దందా అంతకంతకూ పెరిగిపోతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న మూడు వేర్వేరు కేసుల్లో 10మందిని సీబీఐ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. అరెస్టైన వారి నుంచి రూ. 6 కోట్ల విలువైన వివిధ రకాలు మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 2.5 కిలోల ఎండీఎంఏ క్రిస్టల్, 350 ఎక్స్‌టసీ మాత్రలు, 4 కిలోల హషీష్ ఆయిల్, 440 గ్రాముల చరస్, 7 కిలోల గంజాయి ఉన్నాయి.
నిందితులు.. కొత్తనూరు, బనసవాడి, ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా.. గోవా, దిల్లీ, హైదరాబాద్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి కొత్తనూరులోని ఓ అద్దె ఇంట్లో దాచారు. సిస్టమాటిక్ నెట్‌వర్క్ ద్వారా రెట్టింపు ధరలకు డ్రగ్స్‌ను విక్రయించి డబ్బు సంపాదించాలనేదే వీరి ఉద్దేశమని నగర పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.