పాడి పశువులను పెంచుతూ జీవానోపాధిని పొందేలా ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తుంది. అయితే కర్ణాటక కావేరి వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోని గోపీనాథం గ్రామస్థులకు మాత్రం పశువులను ఎక్కువగా పెంచొద్దంటూ అటవీ శాఖ నోటీసులు పంపింది. అవసరమైనన్ని ఆవులు, మేకలను మాత్రమే ఉంచాలని, అదనపు వాటిని వేరే చోటుకు తరలించాలని ఆ నోటీసులలో పేర్కొంది. పశువులను అడవుల్లోకి పంపడం వల్లే అడవి నాశనమవుతోందని తెలిపింది. ఈ ప్రకటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గోపీనాథం ప్రాంతంలో రెండు రోజుల పాటు టీఆర్టీ బృందం పర్యటించింది. ఆ గ్రామంలో చాలా పశువులు ఉండటాన్ని గమనించారు. ఈ పశువులును మేత కోసం తీసుకువెళ్లడం వల్లే అడవి నాశనమవుతోందని భావించారు. దీంతో వ్యవసాయానికి అవసరమైన ఆవులు, మేకలను ఉంచి మిగిలిన వాటిని వేరే చోటుకు తరలించాలని ఆదేశించారు. వాటిని అడవిలో వదిలేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అటవీ శాఖ ఇచ్చిన నోటీసుపై రైతు సంఘం నాయకుడు హొన్నూరు ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "గో సంరక్షణ కోసం ప్రభుత్వం చట్టం చేసింది. అయితే ఆవులను పెంచకూడదని అటవీశాఖ చెబుతోంది. అటవీ ప్రాంతంలో నివసించే వారికి పశువులను మేపేందుకు అనుమతిస్తామని సుప్రీంకోర్టు చెప్పినా.. అటవీశాఖ మాత్రం ఈ నోటీసులిచ్చింది. మరో వారం రోజుల్లో నోటీసును ఉపసంహరించుకోకుంటే పోరాటం చేస్తామని" ప్రకాష్ అన్నారు.