స్వలింగ వివాహాలకు(same sex marriage in india) చట్టబద్ధత కల్పించే విషయంపై తుది వాదనలు వినేందుకు తేదీని ఖరారు చేసింది దిల్లీ హైకోర్టు. ఈ వివాహాలను హిందూ వివాహ చట్టం(హెచ్ఎంఏ), ప్రత్యేక వివాహ చట్టం(ఎస్ఎంఏ) పరిధిలోకి తేవాలని దాఖలైన పిటిషన్లపై నవంబరు 30న తుది వాదనలు వినేందుకు సమయం కేటాయించింది. ఈలోగా కక్షీదారులు లిఖితపూర్వకంగా తమ వాదనలు తెలియచేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతిసింగ్‌తో కూడిన ధర్మాసనం సూచించింది.
స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చినప్పటికీ స్వలింగ వివాహాలు(same sex marriage) సాధ్యం కావడంలేదని అభిజిత్ అయ్యర్ మిత్రాతో పాటు మరో ముగ్గురు ఓ పిటిషన్ దాఖలు చేశారు. స్వలింగ వివాహాలకు హెచ్ఎంఏ, ఎస్ఎంఏ చట్టాలను వర్తింపజేయాలని కోరారు.
ఇదే విషయంపై మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. తమ పెళ్లిని ప్రత్యేక వివాహ చట్టం మేరకు(same sex marriage legal) గుర్తించాలని ఇద్దరు మహిళలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎస్ఎంఏ నిబంధనలను సవాల్ చేశారు.
మరో పిటిషన్‌ను ఇద్దరు పురుషులు దాఖలు చేశారు. అమెరికాలో జరిగిన తమ పెళ్లిని విదేశీ వివాహ చట్టం(ఎఫ్ఎంఏ) ప్రకారం గుర్తించడం లేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డు ఉన్న ఒకరు అమెరికాకు చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. తన జీవీత భాగస్వామికి లింగంతో సంబంధం లేకుండా ఓసీఐ కార్డు మంజూరు చేయాలని కోరారు. అమెరికాలో పెళ్లైన తమకు పౌరసత్వ చట్టం వర్తిస్తుందని, అందులో జీవిత భాగస్వామి లింగ ప్రస్తావన లేదని తెలిపారు. అందువల్ల పెళ్లైన రెండేళ్ల తర్వాత ఓసీఐ కార్డుకు దరఖాస్తు చేసునేందుకు అర్హత ఉంటుందని పేర్కొన్నారు. తమ పిటిషన్‌కు కేంద్రం స్పందన ఇవ్వలేదన్నారు.
దీనిపై కేంద్రం తరఫున న్యాయవాది తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జీవిత భాగస్వామి అంటే భర్త లేక భార్య అనే అర్థం వస్తుందని, పెళ్లంటే ఇద్దరు భిన్న లింగ జంటలకు జరిగేదని చెప్పారు. అందువల్ల పౌరసత్వ చట్టం అంశానికి సంబంధించి వీరికి పత్యేకంగా స్పందన తెలపాల్సిన అవసరం లేదన్నారు.
తాము ఎనిమిదేళ్లుగా కలిసే ఉంటున్నా పెళ్లి చేసుకోవడం(same sex marriage) సాధ్యపడటం లేదని ఇద్దరు మహిళలు పిటిషన్లో పేర్కొన్నారు. ఇల్లు కొనాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా, బీమా చేసుకోవాలన్నా తమకు సమస్యలు ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు.
కేంద్రం వ్యతిరేకం..
స్వలింగ వివాహాలను(same sex marriage in india) చట్ట ప్రకారం గుర్తించడం సాధ్యం కాదని కేంద్రం గతంలోనే కోర్టుకు తెలిపింది. పెళ్లి అనేది ఇద్దరు స్వతంత్ర వ్యక్తుల మధ్య జరిగేదికాదని అది మహిళ, పురుషుడికి మధ్య జరిగే కార్యమని పేర్కొంది. ఈ విషయంలో న్యాయపరమైన జోక్యం శ్రేయస్కరం కాదని పేర్కొంది.
ఇదీ చదవండి: పదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం- తండ్రి ఆత్మహత్య!