తాజాగా దేశ రాజకీయ చర్చల్లో బాగా నలుగుతున్న పేరు వీర్ సావర్కర్! మహాత్ముడి హత్యలో (veer savarkar book) నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొని.. తర్వాత కోర్టు ద్వారా నిర్దోషిగా బయటపడ్డారు సావర్కర్. స్వాతంత్య్రోద్యమ సమరంలో భాగంగా.. తొలిసారి గాంధీజీని దసరా రోజే కలుసుకున్నారు. ఇద్దరూ కలసి లండన్‌లో ఒకే వేదిక పంచుకున్నారు. 1909 అక్టోబరు 24న లండన్‌లో భారతీయులంతా కలసి దసరా ఉత్సవాలు చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న గాంధీజీని రమ్మని ఆహ్వానించారు. రాజకీయాలు మాట్లాడననే షరతుపై గాంధీజీ వచ్చారు. కానీ సమావేశంలో గాంధీ, సావర్కర్ ఇద్దరూ తమతమ రాజకీయ మార్గాలను పరోక్షంగా వెల్లడించారు. రాముడి విజయపథం గురించి గాంధీజీ మాట్లాడగా.. సావర్కర్ రాక్షసులపై దుర్గామాత విజయం ప్రస్తావించారు. భారత్‌లో అంటరానితనం నిర్మూలించాలని ఇద్దరూ బలంగా వాదించారు. భాయ్ సావర్కర్ అంటూ సంబోధించటం ఆరంభించారు గాంధీజీ!
మరుసటి ఏడాదే..
లండన్‌లోని ఇండియాహౌస్ అనేక మంది భారతీయ యువ స్వాతంత్య్రయోధులకు ఆశ్రయం ఇచ్చేది. అతివాదులు, మితవాదులు, విప్లవవాదులు... ఇలా భిన్నమార్గాల వారు భారత స్వాతంత్య్ర లక్ష్యం కోసం తపించేవారు. వారిలో ఒకరు సావర్కర్! 1910 మార్చిలో లండన్ విక్టోరియా రైల్వేస్టేషన్ వద్ద సావర్కర్‌ను బ్రిటన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. భారత్‌లో బ్రిటిష్ ప్రభుత్వానికి (veer savarkar mercy letter truth) వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నందుకుగాను ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. విచారణ కోసం మోరియా అనే వాణిజ్య ఓడలో ఆయన్ను భారత్‌కు తరలించారు. 1910, జులై 7న ఆ ఓడ మార్గమధ్యంలో ఫ్రాన్స్ తీరపట్టణం మార్సెలీస్‌లో ఆగింది. అదే అదనుగా భావించిన సావర్కర్.. ధైర్యంగా ఓడలోని కిటికీలోంచి సముద్రంలో దూకి పట్టణ ఒడ్డుకు చేరుకున్నారు. కానీ ఓ ఫ్రెంచ్ నౌకా బ్రిగేడియర్ ఆయన్ను పట్టుకోవటం.. అంతలో ఓడలోని బ్రిటిష్ సైనికులు రావటం.. ఆయన్ను అప్పగించటం జరిగిపోయింది. ఓడ మరుసటిరోజు భారత్‌కు సాగిపోయింది.
మార్క్స్ మనవడి మద్దతు..
కానీ కథ అక్కడితో ముగియకుండా అనేక మలుపులు తిరుగుతూ బ్రిటన్-ఫ్రాన్స్ మధ్య అంతర్జాతీయ వివాదంగా మారింది. సావర్కర్ తమ భూభాగంపైకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఆయన్ను బ్రిటన్ అధికారులు తీసుకువెళ్లటం అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమంటూ.. సావర్కర్ హక్కులను పునరుద్ధరించాలని ఫ్రాన్స్ డిమాండ్ చేసింది. బ్రిటన్ అందుకు ససేమిరా అనటంతో.. వివాదం హేగ్‌లోని అంతర్జాతీయ (ఆర్బిట్రేషన్) న్యాయస్థానానికి చేరింది. కమ్యూనిస్టు పితామహుడు కార్ల్‌మార్క్స్ మనవడు.. జీన్ లారెంట్ ఫ్రెడరిక్ లాంగెట్ ఈ కేసులో సావర్కర్ తరఫున వాదించారు. సావర్కర్ దేశభక్తిని, సాహసాన్ని, మేధస్సును కొనియాడుతూ దేశస్వాతంత్య్రం కోసం, బానిస సంకెళ్లను తెంపటానికి ఆయన పోరాడుతున్నారని వాదించారు. సావర్కర్‌ను అరెస్టు చేసిన తీరును తప్పుపడుతూనే.. బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు స్పందించింది. 1911 ఫిబ్రవరిలో ఈ తీర్పు రాగానే.. సావర్కర్‌కు ఆంగ్లేయ ప్రభుత్వం 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించి అండమాన్‌లోని కాలాపానీ జైలుకు తరలించింది. శిక్ష పడ్డప్పటి నుంచి 1920 మధ్య నాలుగుసార్లు క్షమాభిక్ష కోసం (veer savarkar mercy) దరఖాస్తు చేసుకున్నారు సావర్కర్. అనేక మంది రాజకీయ ఖైదీలను విడుదల చేసినా.. సావర్కర్ సోదరులను మాత్రం కనికరించలేదు. చివరకు 1921లో సోదరులిద్దరినీ అండమాన్ నుంచి రత్నగిరి (మహారాష్ట్ర) జైలుకు తరలించారు. 1924లో విడుదల చేసినా రత్నగిరి దాటిపోవద్దని ఆంక్షలు విధించారు. గాంధీజీ, అంబేడ్కర్‌లు కూడా అక్కడికే వచ్చి సావర్కర్‌ను కలసి వెళ్లారు. చివరకు 1937లో బేషరతుగా విడుదల చేశారు.
ఇదీ చదవండి:గాంధీ 'సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం'తోనే స్వాతంత్య్రం