Leaders leaving Congress: మొన్న సింధియా.. నిన్న జితిన్ ప్రసాద.. ఇప్పుడు ఆర్‌పీఎన్ సింగ్.. ఇలా వరుసపెట్టి సీనియర్లు వలస బాట పడుతున్నారు. అది కూడా 'గాంధీ' కుటుంబంతో తర తరాల అనుబంధం ఉండి.. రాజకీయంగా కాంగ్రెస్‌లో పుట్టి.. ఎదిగిన వారసులు వెళ్లిపోవడం.. ఆ పార్టీని మరింత సంక్షోభంలోకి నెడుతోంది.
తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆర్‌పీఎన్ సింగ్ భాజపాలో చేరిక వ్యవహారం కాంగ్రెస్‌ను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ సమయంలోనే మరో మాజీ ఎంపీ ఆనంద్ ప్రకాశ్ గౌతమ్ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
ప్రకటించిన మరుసటి రోజే.. రాజీనామా..
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార స్టార్ క్యాంపెయినర్ జాబితాను సోమవారం ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఆ జాబితాలో యూపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, గాంధీ కుటుంబానికి విధేయుడుగా పేరొందిన ఆర్‌పీఎన్ సింగ్‌కు చోటు కల్పించారు. అయితే స్టార్ క్యాంపెయినర్ జాబితా ప్రకటించిన మరుసటి రోజే.. ఆర్‌పీఎన్ సింగ్ కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి.. భాజపా తీర్థం పుచ్చుకోవడం ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
2014 నుంచి ప్రారంభమైన వలసల పరంపర అప్రతిహతంగా సాగుతోంది. సీనియర్లు చాలా మంది కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఇంకా చాలా మంది పార్టీని వీడే వారి జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీని వీడుతున్న వారిలో మెజార్టీ నేతలు భాజపాలోనే చేరుతున్నారు.
అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్‌ను వీడిన ప్రముఖ నాయుకులను ఒకసారి గమనిస్తే.. వారిలో చాలా మంది రాజ వంశీయులే. అందులోనూ చిన్న వయసులో ఉన్నత పదవులు పొందారని, వారు సాధారణ కార్యకర్తలు కాదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్.
- రాజకుటుంబం వారసుడు ఆర్‌పీఎన్ సింగ్
రాజకుటుంబానికి చెందిన ఆర్‌పీఎన్ సింగ్.. కాంగ్రెస్ దిగ్గజ నేత.. దివంగత సీఎఫ్‌పీ సింగ్ కుమారుడు. రెండు తరాలుగా వీరి కుటుంబం కాంగ్రెస్‌లో కొనసాగుతోంది. గాంధీ కుటుంబానికి విధేయులు.
రాజీనామాకు ముందు వరకు జేఎంఎం-కాంగ్రెస్ కూటమి సర్కారు పాలిస్తున్న ఝార్ఖండ్‌కు పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు ఆర్‌పీఎన్ సింగ్.
తొలుత ఆయన పద్రౌనా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఖుషీనగర్ స్థానం నుంచి పోటీ చేసి.. స్వామి ప్రసాద్ మౌర్యను ఓడించారు. మౌర్య ఇటీవల భాజపాను వీడి.. ఎస్పీలో చేరారు.
scindia quits congress
- గ్వాలియర్ రాజవంశ వారసుడు సింధియా..
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత, గ్వాలియర్ రాజవంశ వారసుడు జ్యోతిరాదిత్య సింధియా. జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా చినిపోయే వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కుమారుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌లో అగ్రనేతగా ఎదిగారు.
అయితే పార్టీలో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఆయన భాజపా కండువా కప్పుకున్నారు. అనంతరం రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు.
- జితిన్ ప్రసాదది మూడు తరాల అనుబంధం..
జితిన్ ప్రసాద కుటుంబానికి కాంగ్రెస్‌తో మూడు తరాల అనుబంధం ఉంది. యూపీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జితిన్.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
కాంగ్రెస్‌లో విబేధాలు, లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓటమిపాలవటంతో రాజకీయ భవిష్యత్ కోసం ఆయన భాజపాలో చేరడానికి కారణమైనట్లు సమాచారం.
ఈ మూడు కుటుంబాలు కాంగ్రెస్‌కు మూల స్తంభాల్లాంటివి కావడం గమనార్హం. కాంగ్రెస్ అధినాయకత్వంలో సంస్కరణలు తీసుకురావాలంటూ లేఖ రాసిన జి-23 కాంగ్రెస్ సభ్యుల బృందంలో జితిన్ కూడా ఉన్నారు.
పార్టీలో గందరగోళం
స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించిన మరుసటి రోజునే.. ఆర్‌పీఎన్ సింగ్ కాంగ్రెస్‌ను వీడటంపై పార్టీలోనూ గందరగోళానికి దారి తీసింది. అధిష్టానం దీనిని ఎలా అనుమతిస్తుందని ప్రశ్నిస్తున్నారు.
'యూపీలో స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపికైన.. మరుసటి రోజునే ఆర్‌పీఎన్ సింగ్ పార్టీని వీడారు. ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. ఇది పక్కా ప్లాన్‌తోనే చేశారు. ఆర్‌పీఎన్ సింగ్.. అతని కొత్త స్నేహితులు కాంగ్రెస్ నాయకులను బాధించాలని అనుకున్నారు. కాంగ్రెస్ ఇలాంటివి ఎందుకు జరగనివ్వాలి?' అని జాతీయ కాంగ్రెస్ మీడియా ప్యానలిస్ట్ సల్మాన్ సోజ్ అన్నారు.
" కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నిజంగా విశ్వసించే వారిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం ఎప్పుడు గ్రహిస్తాం? నా స్నేహితుడు శశిథరూర్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మెంబర్‌గా తీసుకోవాలి. స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉండాల్సింది జితిన్, ఆర్‌పీఎన్, సిథియా కాదు.. శశిథరూర్‌లాంటి నాయుకులు ఉండాలి"
- సల్మాన్ సోజ్, జాతీయ కాంగ్రెస్ మీడియా ప్యానలిస్ట్
కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడటానికి పలు కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు జేఎన్‌యూ ప్రొఫెసర్ సంజయ్ కె పాండే.
" రాజకీయంగా భవిష్యత్ లేదనుకోవడం వల్లే నాయకులు పార్టీని వీడుతున్నారు. మరొక పార్టీలో వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి భాజపాలోకి వెళ్తున్న వారికి .. సైద్ధాంతిక మూలాలు బలంగా లేవు."
-సంజయ్ కె పాండే, జేఎన్‌యూ ప్రొఫెసర్.
ఆర్ఎన్పీ సింగ్ భాజపాలో చేరడాన్ని పాత మిత్రులు సింథియాతోపాటు ప్రసాద స్వాగతించారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు.
రాహుల్‌కు సన్నిహితురాలుగా భావించే సుస్మితా దేవ్.. కాంగ్రెస్‌ను వీడి టీఎంసీలో చేరిన కొద్దినెలలకే.. సింగ్ హస్తం పార్టీకి హ్యాండ్ ఇవ్వడం గమనార్హం. వారిలో కొందరు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు.
2014నుంచి పార్టీని వీడిన కాంగ్రెస్ ప్రముఖులు- వరించిన పదవులు
- 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో హర్యానాకు చెందిన కీలక నాయకులు బీరేందర్ సింగ్, రావ్ ఇంద్రజిత్ సింగ్ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. అనంతరం ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో మంత్రులయ్యారు.
- అసోంలో కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న హిమంత బిశ్వా శర్మ.. 2015లో భాజపాలో చేరారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు.
- మాజీ కేంద్ర మంత్రులు ఎస్ఎం కృష్ణ, జయంతి నటరాజన్‌తో పాటు.. గాంధీ కుటుంబ విధేయుడు, అమేథీ రాజకుటుంబానికి చెందిన సంజయ్ సిన్ కూడా గతేడాది భాజపాలో చేరిపోయారు.
- రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్‌గా ఉన్న భువనేశ్వర్ కలితా.. 2019లో భాజపాలో చేరారు. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయన ఇప్పుడు అసోం నుంచి భాజపా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
- 2016లో మణిపుర్‌లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ భాజపాలో చేరారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇబోబి సింగ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పరాజయాన్ని చవిచూసింది.
- ఉత్తరప్రదేశ్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. పీసీసీ మాజీ అధ్యక్షుడు రీటా బహుగుణ జోషి భాజపాలో చేరారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.
- గత ఎనిమిదేళ్ల కాలంలో పార్టీని వీడిన వారు కీలక నేతలు ఎందరో ఉన్నారు. ప్రతిసారి వారి ఐడియాలజీని శంకించడం కాంగ్రెస్ నాయకత్వానికి పరిపాటిగా మారింది.
కాంగ్రెస్ సముద్రం లాంటిది..
సీనియర్ నాయకులు పార్టీని వీడటంపై స్పందించారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్. కాంగ్రెస్ సముద్రం లాంటిదన్నారు. కొందరు పార్టీని వీడినంత మాత్రానా ఎలాంటి.. తేడా ఉండదన్నారు.
"దేశంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌కు మాత్రమే గుర్తింపు ఉంది. భాజపా అధికారంలో ఉంది కానీ.. ఈశాన్య ప్రాంతం, దక్షిణ భారతదేశంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా.. ప్రతి ఇంటిపైనా ఆ పార్టీకి పట్టు ఉంది."
- అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
అయితే వచ్చే నెల ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఈ వలసల సవాళ్లను కాంగ్రెస్ ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.
ఇదీ చూడండి: 'యూపీ ప్రజల ఆకాంక్ష వేరు.. వారివి విభజన రాజకీయాలే'