ఈ దఫా జనగణనలో(Census 2021 India) ఓబీసీ లెక్కలను సేకరించడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓబీసీల వివరాల సేకరణ పరిపాలన పరంగా చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని, దానివల్ల కచ్చితమైన డేటాను(Census 2021 India) రూపొందించడం కష్టమని పేర్కొంది. 2011లో కేంద్రం సేకరించిన ఓబీసీ గణాంకాలను తమకు ఇప్పించాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర సామాజిక న్యాయం - సాధికారత శాఖ ఈమేరకు అఫిడవిట్ దాఖలు చేసింది.
"2021 జనాభా లెక్కల సందర్భంగా కేంద్రం చేపట్టబోయే సామాజిక, ఆర్థిక గణనను వెనుకబడిన తరగతులకూ వర్తింపజేయాలని మహారాష్ట్ర కోరినట్లు కోర్టు ఆదేశిస్తే అది విధాన నిర్ణయంలో జోక్యం చేసుకున్నట్లవుతుంది. 2020 జనవరిలో జారీచేసిన నోటిఫికేషన్‌లో 2021 జనాభా లెక్కల సందర్భంగా సేకరించే సమాచారం వివరాలను వెల్లడించాం. అందులో ఎస్సీ, ఎస్టీలు తప్ప మిగతా ఏ కులం గురించీ చెప్పలేదు. క్లిష్టమైన జనాభా గణన ప్రక్రియలో కులాలవారీగానూ లెక్కలు సేకరించాలంటే మొదటికే మోసమొచ్చే ప్రమాదం ఉంది. ఓబీసీలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర జాబితాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే ఎస్సీ, ఎస్టీలను మినహాయించి మిగిలిన ఏ కులాల లెక్కలనూ సేకరించకూడదని పూర్తిగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం.
-కేంద్రం
కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు క్రైస్తవంలోకి మారారని, అలాంటివారిని ఓబీసీలుగా పరిగణిస్తారని, ఇలా ఎస్సీ, ఓబీసీ లెక్కలను సేకరించాలంటే గణకులు ఎస్సీ, ఓబీసీ జాబితాలు రెండింటినీ పరిశీలించాల్సి ఉంటుందని, అది సాధ్యమయ్యే పనికాదని కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది. ఒకే రకంగా వినిపించే పేర్లను విభిన్న కులాల కింద చేర్చడం ఇబ్బందితో కూడుకున్న అంశమని తెలిపింది. జనగణనకు 3-4 ఏళ్ల ముందు నుంచే కసరత్తు మొదలవుతుందని, ఇందుకు సంబంధించిన ప్రశ్నావళిని తయారుచేసి కేంద్రం ఆమోదించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. ఈ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు కొత్త ప్రశ్నావళిని జత చేయడం సాధ్యంకాదని పేర్కొంది.
ఇదీ చూడండి: వారందరికీ ఇంటి వద్దే టీకా: కేంద్రం