వెజిటేరియన్ నాన్‌వెజ్. ఇలాంటి వింతైన ఓ వంటకం కథ చెప్తాం వింటారా. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా..? కారంగా ఉండే మిఠాయి గురించి చెప్తే మరింత ఆశ్చర్యపోతారు.
రసగుల్లా..! మిఠాయిల రారాజుగా దీనికి పేరు. ఇక యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా అందించే వనరులు మరి మిరపకాయలు. ఈ రెండిటినీ కలిపి, ఓ వింత వంటకం తయారుచేశారు బంగాల్ బర్ధమాన్‌లోని నేతాజీ మిష్ఠన్నా భండార్ నిర్వాహకులు. ఆ వంటకం పేరే చిల్లీ పటాకా రసగుల్లా. పచ్చిమిరపకాయలతో తయారయ్యే తీపి, కారం కలగలిపిన రసగుల్లాలివి.
పచ్చిమిరపకాయలే కాకుండా.. ఈ వింత రసగుల్లాల తయారీలో క్యాప్సికమ్, పచ్చళ్లకు వాడే మిరపకాయలూ ఉపయోగిస్తారు. మామూలు రసగుల్లా తయారీలో వాడే పదార్థాలన్నీ చిల్లీ రసగుల్లా కోసమూ వాడతారు. ఈ ప్రత్యేక వంటకం మిఠాయి దుకాణానికి ఎక్కడాలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. మిరపకాయలతో తయారుచేసినప్పటికీ ఈ చిల్లీ రసగుల్లాలు తియ్యగానే ఉంటాయని చెప్తున్నారు తయారీదారులు. తినేటప్పుడు నాలుకకు కొద్దిగా కారం తగలడమే ఈ రసగుల్లాకు ఇంత ప్రత్యేకత తెచ్చిపెట్టిందంటున్నారు.
చాలా రుచికరంగా ఉంటుందిది. మిరపకాయల వాసనతో ఘాటుగా ఉంటుంది. ఒక్క రసగుల్లాతో తీపి, కారం రుచులు ఆస్వాదించవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తాజా మిరపకాయలు వినియోగిస్తాం. పెరుగు, మిరపకాయలే తయారీలో ప్రధానం. ఈ మిఠాయికి ప్రజల్లో మంచి డిమాండ్ ఉంది.
-రామచంద్ర దాస్, నేతాజీ మిష్ఠన్న భండార్ మేనేజర్
రసగుల్లాలు మరీ తియ్యగా ఉంటే కొంతమంది మహిళలు అస్సలు ఇష్టపడరు. కానీ ఈ రసగుల్లా తిన్న తర్వాత మరిన్ని తినాలని కోరుకుంటారు. ఎక్కువగా మహిళల నుంచే గిరాకీ వస్తోంది. కారం రసగుల్లా అని పిలవొచ్చు దీన్ని.
-సౌమెన్ దాస్, నేతాజీ మిష్ఠన్న భండార్ యజమాని
తాజా మిరపకాయల ఘాటుతో రుచికరంగా.. చాలా బాగుంటుందని సంపతి సాహా అనే వినియోగదారు తెలిపారు. తీపి, కారం రుచులు ఒకేసారి ఆస్వాదించవచ్చని వివరించారు.
ఈ కారం రసగుల్లాలు నేనూ తిన్నా. చాలా బాగుంటాయి. ఈ రసగుల్లా చూడ్డానికి ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
-కృష్ణ ఘోష్, వినియోగదారు
సీతాభోగ్, మిహిదానా ప్రాంతాల్లో చిల్లీ పటాకా రసగుల్లాకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.
ఇదీ చదవండి: భార్య సర్పంచ్.. పంచాయతీ సహాయకుడిగా భర్త