Chandrababu Fibernet Case in Supreme Court: ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. తొలుత చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే అందరూ బెయిల్ మీద బయటే ఉన్నారని, అందువల్ల చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లన్నీ 2021లో నమోదయ్యాయని.. స్కిల్ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పుడు చంద్రబాబు పేరులేదన్నారు. సెప్టెంబరు 8న తొలిసారి చేర్చి నిర్బంధంలోకి తీసుకున్నారని.. నెలరోజులుగా జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.
ఇన్నర్ రింగురోడ్డు కేసులో పీటీ వారంట్లు కోరగా, హైకోర్టు ఆ కేసును అక్టోబరు 16కి వాయిదా వేసి, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ట్రయల్ కోర్టు ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ఆదేశించిందని అన్నారు. సీఐడీ పోలీసులు ఒక కేసులో అరెస్ట్ చేసి ప్రతి కేసులోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారని లూథ్రా వాదించారు. ఫైబర్ నెట్‌కు సంబంధించిన కేసులో ఎఫ్‌ఐఆర్ 2021 డిసెంబరు 9న నమోదు చేసినా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని.. 2022లో కొన్ని వాంగ్మూలాలు తీసుకున్నారన్నారు. 2023లో చంద్రబాబును నిందితుడిగా చేర్చినట్లు చెప్పారని లూథ్రా తెలిపారు.
తొలి ఎఫ్‌ఐఆర్‌లో సెప్టెంబరు 9న అరెస్ట్ చేసిన పోలీసులు ఫైబర్ నెట్ కేసులో సెప్టెంబరు 19న పిటిషనర్‌ను A-25గా చేర్చి సీఆర్‌పీసీ 267 కింద దరఖాస్తు చేయడంతో సోమవారం తన ముందు హాజరు పరచాలని ట్రయల్ కోర్టు ఆదేశించిందని వాదించారు. పిటిషనర్‌ను అక్కడ హాజరు పరిచిన వెంటనే వాళ్లు అరెస్ట్ చేస్తారు.., దానివల్ల స్వేచ్ఛ కోల్పోతామన్నది తమ ఆందోళన అని తెలిపారు. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కంపెనీకి టెండర్ కట్టబెట్టి లబ్ధి చేకూర్చారన్నది ఈ కేసులో ఆరోపణ... ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొనలేదని అన్నారు.
ఫైబర్‌నెట్ కేసులో ఇప్పటికే ముగ్గురు ముందస్తు బెయిల్‌పై, మరో ముగ్గురు సాధారణ బెయిల్‌పై ఉన్నారని లూథ్రా తెలిపారు. మిగిలిన వారిని అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన మెటీరియల్ అంతా దర్యాప్తు సంస్థల దగ్గర ఉందని, అందువలన అరెస్టు చేయాల్సిన అవసరం లేదని.. ఆ బెయిల్ ఉత్తర్వుల్లో కోర్టు అభిప్రాయపడిందన్నారు. ఇందులో A1గా ఉన్న టెండర్ కమిటీ ఛైర్మన్‌కు 2021 సెప్టెంబరు 29న ముందస్తు బెయిల్ వచ్చినా... రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదని గుర్తుచేశారు.
ఇందులో A2గా ఉన్న ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌కు, A11గా ఉన్న టెరాసాఫ్ట్ ఎండీకి, A22గా ఉన్న ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ కంపెనీ డైరెక్టర్‌కూ ముందస్తు బెయిళ్లు వచ్చినట్లు తెలిపారు. అలాంటప్పుడు చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పిటిషనర్ రాష్ట్రంలోనే ఉన్నారని, ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో ఇలా చేస్తున్నారని చెప్పారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ జోక్యం చేసుకుని.. ఇందులోనూ 17A పాయింట్ వస్తోంది కదా? అని అడగ్గా అవునని సిద్ధార్థ లూథ్రా చెప్పారు.
అందువల్ల తాము ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీచేస్తామని చెప్పారు. ఆ నోటీసులను స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఆదేశిస్తూ.. మంగళవారం తదుపరి విచారణ చేపడతామని అన్నారు. వెంటనే సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ.. సోమవారం పిటిషనర్‌ను ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచాలని వారంట్లు జారీ చేశారని, తదుపరి విచారణ వరకు వాటిని నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో హైకోర్టు ఇప్పటికే వారంట్లను నిలిపివేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ వాదనలను రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది రోహత్గీ వ్యతిరేకించారు. అప్పుడు జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ.. 17A వర్తిస్తుందా? లేదా? అనే అంశంపై ఇప్పటికీ తాము విచారిస్తున్నామని చెప్పారు. ఈ కేసులో పిటిషనర్ రిమాండ్‌లో ఉన్నందున ఇందులో ముందస్తు బెయిల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పెద్ద తేడా ఉండదన్నారు. ఒకవేళ 17ఎ అంశంలో గెలిస్తే మీకు రెగ్యులర్ బెయిల్ కూడా దక్కే అవకాశం ఉంటుందన్నారు.
సోమవారం పిటిషనర్‌ను అరెస్ట్ చేస్తే మంగళవారం విచారణ నాటికి ఈ కేసు నిరర్థకం అవుతుందని, అందువల్ల మంగళవారం వరకు పిటిషనర్ హాజరు వారంట్లను నిలుపుదల చేయాలని లూథ్రా కోరారు. దానికి ముకుల్ రోహత్గీ తీవ్ర అభ్యంతరం చెప్పారు. తర్వాత జస్టిస్ అనిరుద్ధ బోస్ జోక్యం చేసుకుంటూ.. తాము ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబోమని, అయితే సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి సూచించారు.
ఈ కేసును బుధవారానికి వాయిదా వేయమని ట్రయల్ కోర్టును కోరుతామని ధర్మాసనానికి ముకుల్ రోహత్గీ హామీ ఇచ్చారు. అందుకు ధర్మాసనంతో పాటు, చంద్రబాబు తరఫు న్యాయవాదులూ అంగీకరించారు. దీంతో జస్టిస్ అనిరుద్ధ బోస్ విచారణ ముగించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేశారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారాని కల్లా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్దేశించారు.