PNB Fraud Case: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐ కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి అత్యంత సన్నిహితుడు.. సుభాష్ శంకర్ పరబ్‌ను ఇంటర్‌పోల్ సాయంతో అరెస్ట్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. సుభాష్ శంకర్‌పై ఇంటర్‌పోల్ ఇదివరకే రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. నిందితుడిని ఈజిప్టు నుంచి ప్రత్యేక విమానంలో ముంబయికు తరలించింది సీబీఐ.
నిందితుడు కైరోలో తలదాచుకున్నట్లు అందిన సమాచారాన్ని నిర్ధరించుకున్న తర్వాతే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామని.. ఈ క్రమంలో అతడిని భారత్‌కు రప్పించడానికి విదేశాంగ శాఖ సహకారం పొందినట్లు అధికారులు వెల్లడించారు. సుభాష్‌ను ముంబయిలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో మంగళవారం హాజరుపరచనున్నట్లు సమాచారం. విచారణ అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించాలని సీబీఐ కోరనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన 49 ఏళ్ల సుభాష్ శంకర్.. 2018లో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతో కలిసి విదేశాలకు పరారయ్యాడు. నిందితుడిపైన నాలుగేళ్ల క్రితమే సీబీఐ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఇంటర్‌పోల్‌ను హెచ్చరించింది. ఈ క్రమంలో తాజాగా ఇంటర్‌పోల్ సాయంతో సుభాష్‌ను పట్టుకున్నారు.
ఇదీ చూడండి : ''అన్న తిరిగొచ్చాడు..' నిందితుడికి స్వాగతం పలుకుతూ హోర్డింగులా?'