కేంద్రం తీసుకొచ్చే చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానాలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అసెంబ్లీ ఎందుకు తన అభిప్రాయాన్ని వ్యక్తపరచకూడదని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో.. చట్టాలపై న్యాయస్థానంలో విచారణ పెండింగ్‌లో ఉండగా వాటిపై వ్యతిరేక తీర్మానాలు చేయకూడదని పిటిషనర్ తరఫు న్యాయవాది సౌమ్య చక్రవర్తి తెలిపారు. అయితే, దీనిపై మరింత అధ్యయనం చేసి రావాలని సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు సూచించింది.
సీఏఏ, సాగు చట్టాలు వంటి వాటిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని 'సమతా ఆందోళన సమితి' సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేసింది. రాజస్థాన్, కేరళ, పంజాబ్, బంగాల్ అసెంబ్లీలు కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయని ఆరోపించింది.
ఇదీ చదవండి:'ఈవీఎంపై గుర్తులకు బదులు అభ్యర్థుల వివరాలు'