కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కరవు భత్యం (డీఏ)ను 3 శాతం పెంచింది. ఈ మేరకు గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఉద్యోగులకు ఇచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను 3 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పెంపు 2021 జులై నుంచే అమలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 28 శాతం ఉండగా.. తాజా నిర్ణయంతో 31శాతానికి చేరింది.
కేంద్రం నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలగనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70కోట్ల మేర అదనపు భారం పడనుంది.
కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా గతేడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని నిలిపివేసింది. ఈ ఏడాది జులై నుంచి దాన్ని పునరుద్ధరించడమే గాక.. 17 శాతం ఉన్న డీఏను 28 శాతానికి పెంచారు. ఇప్పుడు మరో 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
మౌలిక రంగ అభివృద్ధి దిశగా మరో కీలక నిర్ణయం
దేశ మౌలిక రంగ అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా రూ.100 లక్షల కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రం.. ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లాజిస్టిక్ ఖర్చులను తగ్గించడం, కార్గో నిర్వహణ సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో దీనిని ఆమోదించింది.
ఇదీ చూడండి: India 100 crore vaccine: భారత్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు!