Break For yuvgalam with CID cases: ఓ వైపు చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన.. ఇంకోవైపు లోకేశ్ యువగళం పాదయాత్ర జోరుగా సాగుతున్న తరుణంలో చోటుచేసుకున్న ఊహించని పరిణామాలు.. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు రేకెత్తిస్తున్నాయి. అంతకు ముందే యువగళానికి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా.. అన్ని అవమానాలను ఎదుర్కొని లోకేశ్ వడివడిగా అడుగులు వేశారు. రోజులు గడుస్తున్నా కొద్దీ ఆయనకు ప్రజాబలం రెట్టింపయ్యింది. చిత్తూరు జిల్లాలో మొదలైన యువగళం 200 రోజులకు పైగా విజయవంతంగా సాగుతూ దాదాపు 3 వేల కిలోమీటర్లకు చేరువై తూర్పుగోదావరి జిల్లాకు రాజోలుకు చేరింది.
ఇక... అప్పటికే ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా పుంగనూరు వెళ్తున్న చంద్రబాబును వైసీపీ శ్రేణులు అంగళ్లులో అడ్డగించగా.. ఇరువర్గాల మధ్య పోరు రణరంగంలా మారింది. అన్ని అడ్డంకులను దీటుగా ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న తరుణంలో ప్రభుత్వం సీఐడీ రూపంలో మరో అస్త్రాన్ని వాడుకుంది. ఎఫ్ఐఆర్లో పేరు లేకున్నా.. చంద్రబాబును అరెస్టు చేసింది. దీంతో యువగళానికి కూడా బ్రేక్ పడింది. సెప్టెంబర్ 9న నిలిచిపోయిన యువగళం.. 29న పునఃప్రారంభించేందుకు లోకేశ్ సమాయత్తం కాగా.. ఆయన్ను సైతం రెండు కేసుల్లో ఇరికించింది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌పై ఏడాది కిందటే కేసు నమోదు చేసిన సీఐడీ.. ఎఫ్ఐఆర్లో తాజాగా లోకేశ్ పేరును చేర్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ లోకేశ్ హైకోర్టును ఆశ్రయించగా.. సీఆర్పీసీ (CRPC) 41A ప్రకారం ముందస్తు నోటీసులు ఇస్తామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు వెల్లడించారు. దీంతో ఏజీ వివరాలు నమోదు చేసుకున్న హైకోర్టు.. అరెస్టు గురించి ఆందోళన లేనందున ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసినట్లు ప్రకటించింది. కాగా, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లో లోకేశ్‌కు నోటీసులు సిద్ధం చేయగా.. ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్లు హైకోర్టు విచారించింది. స్కిల్ కేసులో లోకేశ్‌ను వచ్చే నెల 4 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించడంతో పాటు విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది. అదే విధంగా ఫైబర్‌నెట్ కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ కూడా అక్టోబర్ 4కు హైకోర్టు వాయిదా వేసింది.
ఇక ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయగా.. సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేసింది.