బంగాల్లో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. గత ప్రభుత్వాలు చేసిన తప్పులనే ప్రామాణికంగా చేసుకుని ఎన్నికల ప్రణాళిక పత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో బంగాల్‌కు అంటిన అవినీతి మరకను తొలగించి.. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారుస్తామని, సోనార్ బంగాల్‌గా మారుస్తామని ఆ పార్టీ నేతలు హమీలు ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన మేనిఫెస్టోను ఆదివారం ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
పరిశ్రమలుకు ఊతం ఇచ్చే దిశగా....
భాజపా మేనిఫెస్టో.. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరి చేసే దిశగా రూపదిద్దుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. స్థానిక మార్కెట్లకు ఊతం ఇచ్చేలా అంతర్జాతీయ సరిహద్దులను అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా వోకల్ ఫర్ లోకల్ అనే ప్రధాని పిలుపునకు బంగాల్లో ప్రాణం పోసే దిశగా కమల దళం అడుగులు వేయనున్నట్లు సమాచారం. ఇవే కాక.. పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలకు పునరుజ్జీవం కల్పించడం, భూసేకరణ విధానంలో రైతులకు మరింత లబ్ధి చేకూర్చడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయం, జనపనార, టీ పరిశ్రమకు చేయూతనివ్వడం వంటి కార్యక్రమాలు భాజపా మేనిఫెస్టోలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తలపెట్టిన ప్రాజెక్టులను పునరుద్ధరించడం, పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకు రావడంపై కమలదళం ప్రధానంగా దృష్టి సారించిందని నేతలు చెబుతున్నారు.
గత పాఠాల నుంచి...
గతంలో నందిగ్రామ్, సింగూర్‌లలో జరిగిన దమనకాండలు మరలా పునరావృతం కాకుండా భాజపా జాగ్రత్త పడుతోంది. కమ్యూనిస్ట్‌ల సిద్ధాంతాలు, దీదీ మార్క్ పరిశ్రమల వ్యతిరేక విధానాలపై ఆ పార్టీ నాయకులు మేనిఫెస్టో ద్వారా ఎండగట్టాలని భావిస్తున్నారు. బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఆటో మొబైల్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సాగు చేయలేని భూములను మాత్రమే గుర్తించాలని అనుకుంటున్నారు.
కోటి ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా...
యువతను ఆకర్షించే దిశగా ఉపాధి మంత్రం జపించనుంది. ఇందుకు కోటి ఉద్యోగాల కల్పనే ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు సమాచారం. వీటిలో భాగంగా పెట్రోకెమికల్ పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను పునరుద్ధరించాలని పార్టీ హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు బంగాల్ వస్త్ర పరిశ్రమను ప్రత్యేక బ్రాండ్‌గా ప్రమోట్ చేయాలని చూస్తోంది.
చిత్రపరిశ్రమ అభివృద్ధికి...
భాజపా తరఫున ఈ ఎన్నికల్లో చాలా మంది నటులు పోటీలో ఉన్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్ తరహాలో చిత్ర పరిశ్రమకు భూమిని వాగ్దానం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు టీఎంసీ వైఫల్యాలను ఎండగట్టేలా భాజపా మేనిఫెస్టో సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.