ప్రేమలో పడితే రాత్రి, పగలు, మంచి, చెడు, తెలుపు, నలుపు లాంటివేం కనిపించవని దేశముదురు సినిమాలో డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాదాపుగా ఇది నిరూపించాడు బిహార్లో ఓ యువకుడు. ట్రాన్స్జెండర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు
డ్యాన్స్ ప్రోగ్రామ్లో చూసి..
గోలు కుమార్.. రోహ్తాస్ జిల్లా, కార్గహర్ గ్రామానికి చెందిన కుర్రాడు. పక్క గ్రామం పనాపుర్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి వెళ్లాడు. అక్కడ నందిని అనే ట్రాన్స్ జెండర్ను చూసి ప్రేమించాడు. కొంత కాలం పరిచయం కొనసాగించి.. ప్రేమను వ్యక్తపరిచాడు. నందిని కూడా గోలును ప్రేమించింది. ఓ శుభ గడియ చూసుకుని ఇద్దరు ఒక్కటయ్యారు. గుడిలో నందిని మెడలో తాళి కట్టాడు గోలు.
గాఢంగా ప్రేమిస్తున్నా..
ఇంట్లో ఉంటే చుట్టుపక్కల ప్రజలు అపహాస్యం చేస్తారని భావించి.. స్వగ్రామంలోనే అద్దె ఇంట్లో కొత్త కాపురం పెట్టాడు గోలు. అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని సొంత ఊర్లోనే వేరే ఇంట్లో ఉండడమేంటని.. కుటుంబ సభ్యులు, బంధువులు కొత్త జంటను చూడటానికి వెళ్లారు. విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. నందినిని ఇంటికి తీసుకురావటం ఇష్టంలేక గోలును ఆమె నుంచి వేరు చేయడానికి ప్రయత్నించారు. కానీ నందినితోనే కలిసి ఉంటానని, గాఢంగా ప్రేమిస్తున్నానని గోలు చెప్పాడు.
అత్తమామలు తనను గోలు నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న నందిని.. గోలు ఇంటికే వెళ్లింది. దీంతో గోలు అమ్మ అవమాన భారంతో స్పృహతప్పి పడిపోయింది. ఈ క్రమంలో గోలు ఇంటి వద్ద జనం గుమిగూడారు. నందినిని పంపించి వేయడానికి పెద్ద గొడవే జరిగింది. అందరూ చర్చించుకుని నందినిని ఒప్పించి ఎట్టకేలకు పంపించి వేశారు.
ఇదీ చదవండి: ముంబయిని వణికించిన 9వ తరగతి విద్యార్థి!