Bhupesh Baghel Exclusive Interview : ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ ప్రకటించినవి అసలు హామీలే కాదని ఆరోపించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. త్వరలో జరగనున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో 75కు పైగా స్థానాల్లో గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తొలి దశలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన పోలింగ్‌లో భారీగా ఓటర్లు పాల్గొన్నారని తెలిపారు. ప్రజల్లో ప్రజాస్వామ్యానికి ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న బఘేల్.. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. బీజేపీ చెప్పిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని.. కానీ, కాంగ్రెస్ మాత్రం గత ఐదేళ్లలో ఇచ్చి ప్రతి దానిని పూర్తి చేసిందని తెలిపారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేరుస్తామని.. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు.
"నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానన్న మోదీ.. ఇప్పటి వరకు వేయలేదు. రైతుల ఆదాయం ఇంకా రెట్టింపు కాలేదు. ద్రవ్యోల్బణం తగ్గలేదు. ఇప్పటికే బీజేపీపై నమ్మకాన్ని కోల్పయిన ప్రజలు.. ఇకపై మోదీని కూడా నమ్మరు."
--భూపేశ్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రూ. 24లక్షల రుణాలను రద్దు చేసిందని.. కానీ రైతులకు మాత్రం ఎలాంటి మాఫీలు చేయలేదన్నారు బఘేల్. రెండేళ్ల కరోనా సంక్షోభ సమయంలో రైతులు, సామాన్యులు ఎన్నో బాధలు పడ్డారన్నారు. ప్రతి వ్యక్తి, కుటుంబ అభివృద్ధి తమ లక్ష్యమని చెప్పారు. ఆర్థిక, సామాజిక, విద్య, ఆరోగ్యం ఇలా ప్రతి రంగంలో తమ మార్క్‌ను చూపుతున్నామన్నారు. ఈ సందర్భంగా మహదేవ్ బెట్టింగ్ యాప్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
"మహాదేవ్ యాప్ డైరెక్టర్‌ను మోదీ ప్రభుత్వం ఎందుకు కాపాడుతుంది? ఆయనకు మోదీ ప్రభుత్వానికి మధ్య జరిగిన లావాదేవీలు ఏంటి? ఆ యాప్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల్లో ఇప్పటికీ నడుస్తోంది. దానిని ఎప్పుడు నిషేధిస్తారు. బీజేపీ నేతల మధ్య కూడా అనేక లావాదేవీలు నడిచాయి. ఓ బీజేపీ నేత సోదరుడి కారులో కూడా నగదు లభ్యమైంది. రమణ్ సింగ్, గవర్నర్ సహా అనేక మంది బీజేపీ నేతలతో దిగిన ఫొటోలు ఉన్నాయి. కచ్చితంగా బీజేపీ నేతలకు మాహాదేవ్ యాప్ డైరెక్టర్లతో సంబంధం ఉంది."
--భూపేశ్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి
Congress Manifesto in Chhattisgarh 2023 : ఛత్తీస్‌గఢ్‌లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఇప్పటికే మేనిఫెస్టోను ప్రకటించింది. అధికారంలోకి వస్తే వరికి మద్దతు ధరను క్వింటాకు రూ.3,200 చేస్తామని ప్రకటించింది. దీంతో పాటు రైతులకు పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తో పాటు గ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ ఇస్తామని చెప్పింది. బస్తా తునికి ఆకుకు రూ.6,000 చెల్లిస్తామని.. ఈ ఆకులను సేకరించే వారికి వార్షిక బోనస్‌గా రూ.4000 ఇస్తామని చెప్పింది.
బస్తర్‌లో పోలింగ్ వేళ అలజడి- నక్సలైట్లు, పోలీసుల మధ్య కాల్పులు, ఐఈడీ పేలుడు