కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో భారత సంస్థలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన జైడస్ కాడిలా సంస్థ... త్వరలోనే వ్యాక్సిన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ క్యాండిడేట్ జైకొవ్-డీ క్లినికల్ ట్రయల్స్‌ను మరో 7 నెలల్లో పూర్తి చేయనున్నట్లు జైడస్ కాడిలా ఛైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ పేర్కొన్నారు.
"వ్యాక్సిన్ క్యాండిడేట్ జైకొవ్-డీ.. ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్‌ను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేసి, ఫలితాలను నియంత్రణ సంస్థకు పంపించనున్నాం. ఫలితాల ఆధారంగా టీకా ప్రభావవంతమని తేలితే విడుదల చేసేందుకు ఏడు నెలలు పడుతుంది. భారతీయ మార్కెట్ అవసరాలు తీర్చడమే మా తొలి లక్ష్యం."
-పంకజ్ ఆర్ పటేల్, జైడస్ కాడిలా ఛైర్మన్
వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫార్మా కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు సంస్థ సిద్ధమవుతోందని పంకజ్ పేర్కొన్నారు. అయితే ఇప్పుడే వీటి గురించి ఆలోచించడం తొందరపాటే అవుతుందని అన్నారు.
మానవ ప్రయోగాలు ప్రారంభం..
బుధవారం నుంచి జైకొవ్-డీ మానవ ప్రయోగాలు ప్రారంభించినట్లు జైడస్ కాడిలా సంస్థ ప్రకటించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెయ్యి మందిని వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి- 'కొవాగ్జిన్' మానవ ట్రయల్స్ షురూ..